Bhadrachalam Hospital Doctors Negligence: భద్రాచలం ఏరియా హాస్పిటల్‌లో నిర్లక్ష్యం... బతికున్న బిడ్డ చనిపోయాడన్న వైద్యులు..

Bhadrachalam Hospital Doctors Negligence: బతికుండగానే శిశువు చనిపోయిందంటూ వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పిన సంఘటన భద్రాచలంలో చోటు చేసుకుంది.

Update: 2020-06-29 05:43 GMT

Bhadrachalam Hospital Doctors Negligence: బతికుండగానే శిశువు చనిపోయిందంటూ వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పిన సంఘటన భద్రాచలంలో చోటు చేసుకుంది. పురిటి నొప్పులతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన గర్భిణికి భద్రాచలం ఏరియా హాస్పిటల్‌ వైద్య సిబ్బంది స్కానింగ్ చేసి కడుపులో ఉన్న కవలల్లో ఒకరు చనిపోయారని తెలిపారు. అనంతరం చనిపోయిన శిశువును బయటికి తీయడానికి సర్జరీ చేసిన వైద్యులు బతికున్న మరో శిశువు కూడా చనిపోయిందని చెప్పారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లోని చింతూరు మండలం నరిసింహాపురం గ్రామానికి చెందిన ముచ్చిక సునీత ఆరు నెలల గర్భిణి. కాగా ఆమెకు శుక్రవారం నొప్పులు మొదలయ్యారు. నెలలు నిండకుండా నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు హడావుడిగా చింతూరు ఏరియా హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించడంతో శుక్రవారం రాత్రి భద్రాచలం ప్రభుత్వ హాస్పిటల్‌లో చేరింది.

వెంటనే అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి స్కానింగ్ తీసారు. ఆ స్కానింగ్ రిపోర్టులను పరిశీలించిన వైద్యులు కడుపులోని కవలల్లో ఓ శిశువు చనిపోయిందని కుటుంబ సభ్యులకు చెప్పారు. చనిపోయిన శిశువును వెంటనే తీసేయాలని, లేదంటే తల్లికి మరో బిడ్డకు కూడా ప్రమాదం అని తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో శనివారం వైద్యులు గర్బిణికి సర్జరీ చేసి చనిపోయిన ఆడ బిడ్డను తీసారు. ఆ తరువాత బతికున్న మగబిడ్డను కూడా బయటికి తీసి ఇద్దరూ చనిపోయారని కుటుంబ సభ్యులకు తెలిపారు. అనంతరం ఆ చిన్నారులను కవర్లో చుట్టి ఇచ్చారు. కాగా బాధలో ఉన్న బాలింత సునితను పరామర్శించడానికి వచ్చిన బాబాయికి జరిగిన విషయం తెలపడంతో ఆయన చిన్నారులను కవరునుంచి బయటికి తీసి చూసాడు. కాగా ఆ సమయంలో ఒక బిడ్డ కదలడంతో వెంటనే వైద్యులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన వైద్యులు వెంటనే ఆ బిడ్డను ప్రత్యేక వార్డులోకి మార్చి చికిత్స అందిస్తున్నారు. వైద్యం అందించడంలో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. ఇద్దరు చిన్నారులు చనిపోయారని చెప్పారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ విషయమై భద్రాచలం ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చావా యుగంధర్‌ స్పందించి వివరణ ఇచ్చారు. శనివారం ఉదయం గర్భిణిక సర్జరీ చేసి చనిపోయిన బిడ్డతో పాటు ఆరోగ్య పరిస్థితి బాగోలేని మరో బిడ్డను కూడా బయటికి తీసి తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. సర్జరీ సమయంలో రెండో బిడ్డ కూడా శ్వాస తీసుకోలేదని, శిశువు బరువు 500 గ్రాములు మాత్రమే ఉందని తెలిపారు. ఆ బిడ్డ బతకడం కష్టమని తమ సిబ్బంది కుటుంబ సభ్యులకు తెలిపారన్నారు. రెండో బిడ్డను కుటుంబ సభ్యులు బయటకు తీసుకెళ్లారని, తిరిగి తీసుకు రావడంతో.. చికిత్స అందిస్తున్నామన్నారు.

Tags:    

Similar News