Jagadish Reddy: "స్పీకర్ వదిలినా కోర్టులో శిక్ష తప్పదు": పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Jagadish Reddy: తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి రాజకీయ సెగలు రేపుతోంది.
Jagadish Reddy: తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి రాజకీయ సెగలు రేపుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో స్పీకర్ అనుసరిస్తున్న వైఖరిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ చట్టపరంగా, కనీసం ఆత్మసాక్షిగా కూడా వ్యవహరించడం లేదని ఆయన మండిపడ్డారు.
బహిరంగంగా పార్టీ కండువాలు కప్పుకుని, కాంగ్రెస్ అధికారిక సమావేశాల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఎందుకు కనిపించడం లేదని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. "వారు పార్టీ మారినట్లు ప్రపంచమంతటికీ అర్థమవుతున్నా.. స్పీకర్ మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అత్యంత దురదృష్టకరం. స్పీకర్ వ్యవస్థ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోంది, దీనిని ప్రజలందరూ గమనిస్తున్నారు" అని ఆయన ధ్వజమెత్తారు.
శాసనసభాపతి తమ పిటిషన్లను పక్కన పెట్టినా, న్యాయస్థానాల్లో మాత్రం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు శిక్ష తప్పదని జగదీష్ రెడ్డి హెచ్చరించారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాల్సిందేనని, న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఆయన వ్యాఖ్యానించారు. నైతిక విలువలు వదిలేసి రాజకీయం చేయడం ఎంతో కాలం సాగదని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు.