Arvind Dharmapuri: రాత్రి 11 గంటలకు ఈ గోలేంటి? మమ్మల్ని పడుకోనివ్వండి: మసీదు స్పీకర్లపై ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
Arvind Dharmapuri: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి వార్తల్లో నిలిచారు.
Arvind Dharmapuri: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన నివాసం సమీపంలోని మసీదు నుంచి వస్తున్న లౌడ్ స్పీకర్ల శబ్దంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి ఈ శబ్దానికి సంబంధించిన వీడియోను తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాత్రి 11 గంటల సమయంలో మసీదు స్పీకర్ల నుంచి భారీ శబ్దం వస్తుండటంతో అర్వింద్ మండిపడ్డారు. "రాత్రి 11 గంటల సమయంలో ఈ కర్ణభేరి పరీక్ష ఏంటి? మీకు జాగారం కావాలంటే చేసుకోండి.. కానీ మమ్మల్ని పడుకోనివ్వండి" అంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అర్థరాత్రి వేళల్లో ఇలాంటి శబ్దాలు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
రానున్న బోర్డు పరీక్షలను దృష్టిలో ఉంచుకుని అర్వింద్ ఈ సమస్యను లేవనెత్తారు. మరో 15 రోజుల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయని, ఆ వెంటనే ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. విద్యార్థులు చదువుకోవాల్సిన ఈ కీలక సమయంలో, అర్థరాత్రి ఇలాంటి శబ్దాలు వారి ఏకాగ్రతను దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే అర్వింద్ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని కొందరు విమర్శిస్తుండగా.. ఏ ప్రార్థనా మందిరమైనా సరే, ప్రజలకు అసౌకర్యం కలిగించకూడదని, ధ్వని కాలుష్యాన్ని నియంత్రించాలని మరికొందరు మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.