Karimnagar: విధి నిర్వహణలో నిబద్ధత.. ఆరోగ్యంపై జాగ్రత్త
Karimnagar: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో "SHE LEADS - 2026" (కాన్ఫరెన్స్ విత్ విమెన్ పోలీస్ ఆఫీసర్స్ 3.0) ఘనంగా జరిగింది.
Karimnagar: విధి నిర్వహణలో నిబద్ధత.. ఆరోగ్యంపై జాగ్రత్త
కరీంనగర్: మహిళా పోలీసు అధికారులలో నైపుణ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో కరీంనగర్ పోలీస్ ఆధ్వర్యంలో అస్త్ర కన్వెన్షన్‌లో "SHE LEADS - 2026" (కాన్ఫరెన్స్ విత్ విమెన్ పోలీస్ ఆఫీసర్స్ 3.0) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఈ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజ రక్షణలో మహిళా పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. కేవలం అధికారం కోసం కాకుండా, రక్షణ మరియు సేవా భావంతో బాధ్యతలు నిర్వహించాలని వారిని ప్రోత్సహించారు.ఈ సదస్సులో పలు ఆసక్తికరమైన అంశాలపై చర్చలు మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
మహిళలు మనో ధైర్యంతో పని చేయాలి..
డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ కలాం (Sanskrit-OU) చే మహిళా అధికారుల్లో మనోధైర్యాన్ని నింపే విధంగా ప్రసంగాన్ని నిర్వహించారు. విధుల పట్ల మహిళలు చాలా నిబద్ధతతో ఉండాలని, కుటుంబం పట్ల ఎలాంటి బాధ్యత నిర్వహిస్తారో పనిలో కూడా అలాగే బాధ్యతగా మెలగాలని సూచించారు.
ఆరోగ్యం కోసం సమయం కేటాయించండి..
మహిళా అధికారులు సిబ్బంది తప్పకుండా ఆరోగ్య సూత్రాలు పాటించాలని దీప్తి తెలిపారు. ఆరోగ్యం కోసం యోగ, ఎక్సర్సైజ్ తప్పకుండా చేయడం వల్ల మెరుగైన ఆరోగ్యం నిలకడగా ఉంటుందన్నారు.
పోషకాహారం, ఆహార నియమాలు మరియు యోగా యొక్క ప్రాముఖ్యతను మహిళా పోలీసు అధికారులకు వివరించారు.
విధి నిర్వహణలో కఠినంగా ఉండాలి..
హుజూరాబాద్ ఏసీపీ వి. మాధవి విధుల నిర్వహణపై చర్చ కార్యక్రమాల్లో బాధితులు, నిందితులు మరియు ఆందోళనకారుల పట్ల వ్యవహరించాల్సిన తీరుపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ విధుల పట్ల బాధ్యత యుతంగా ఉండాలని సూచించారు.
ఉచిత వైద్య పరీక్షలు..
మధ్యాహ్నం సెషన్‌లో మహిళా అధికారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో:
ఆరోగ్య మహిళ (DMHO) ఆధ్వర్యంలో జనరల్ చెకప్.గైనకాలజీ సంప్రదింపులు, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు (చల్మెడ ఆనందరావు ఆసుపత్రి).
నేత్ర పరీక్షలు (రేకుర్తి చారిటబుల్ ట్రస్ట్) నిర్వహించారు. కార్యక్రమం ముగింపులో పాల్గొన్న వారికి బహుమతులు అందజేసి, అతిథులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) వెంకటరమణ, ఏసీపీ హుజూరాబాద్ వి మాధవి, ఏసీపీ సీటీసీ వేణుగోపాల్ రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రజినీకాంత్ , కిరణ్ కుమార్ మరియు కరీంనగర్ కమిషనరేట్‌కు చెందిన మహిళా అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.