తొమ్మిది రూపాయలకే చీర...ఎగబడిన మహిళలు..తోపులాట

Update: 2018-10-13 11:18 GMT

కొత్త బట్టల షాప్ ఓపెనింగ్, ఆకట్టుకునే ఆఫర్ ఇంకెముంది.. అసలే దసరా వస్తుంది. 9రూపాయలకే చీరంటున్నారని అక్కడి మహిళలంతా దుకాణం ముందు క్యూకట్టారు. దీంతో చీరల కోసం ఎగబడి వచ్చిన మహిళలను అదుపు చేయడం ఆ దుకాణం యజమానుల తరం కాలేదు. ఇంతకీ 9 రూపాయల చీరలేంటి..? ఆ షాపు ఎక్కడ ? 

వనపర్తి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటైన ఓ వస్త్ర దుకాణం యజమానులు పండగ సందర్భంగా అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు 9రూపాయలకే చీర అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అది కూడా ఉదయం 9 నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకేనంటూ కండీషన్ పెట్టారు. దీంతో ఇంట్లో పనులు కూడా పక్కన పెట్టి గంట ముందు నుంచే దుకాణం వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడారు మహిళలు. 

తామిచ్చిన ప్రకటనకు స్పందించి పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలను చూసి ఖంగుతిన్న వస్త్ర దుకాణం యజమానులు 11 గంటలకు ఇస్తామని చెప్పడంతో ఒక్కసారిగా తోపులాట జరిగి ఉద్రిక్తత ఏర్పడింది. 9గంటలకే ఇస్తామని చెప్పి ఇప్పుడు 11గంటలకు అంటున్నారంటూ వారితో వాగ్వాదానికి దిగారు. 

షాపు ప్రారంభోత్సవానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే చిన్నారెడ్డి జ్యోతిప్రజ్వలన అనంతరం ఐదుగురు మహిళలకు మాత్రమే చీరలు పంచి వెళ్లిపోయారు. అప్పటికే బయట పడిగాపులు కాచిన మహిళలను వనపర్తి సంస్థానం రాజాగారి బంగ్లా వద్దకు వెళ్లి టోకెన్లు తెచ్చుకోవాలని చెప్పడంతో అక్కడికి వెళ్లి టోకెన్లు తెచ్చుకోవడం వారికి ప్రాణసంకటంగా మారింది. 9రూపాయల చీరేమో గానీ, ఒంటి మీద ఉన్న చీరలు కూడా చిరిగిపోయాయి.  టోకెన్ల కోసం తోపులాట జరగడంతో కొందరివి సెల్‌ఫోన్లు, మరికొందరివి చెవి కమ్మలు పోయాయి. మొత్తానికి టోకెన్ దొరికిన వారు చీరతో ఇంటికెళితే టోకెన్లు దొరకని వారు ఒంటిపై చిరిగిన చీరతో, వస్తువులు కోల్పోయి దేవుడా అంటూ వెళ్లారు. 

Similar News