మలేసియా కంపెనీలు అమరావతిలో భారీగా పెట్టుబడులు
ప్రజారాజధాని అమరావతిలో పర్యటించేందుకు మలేసియా బృందం అమరావతికి చేరుకుంది. బృందంలోని సభ్యులైన మలేసియాలోని క్లాంగ్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు, మలేసియా- ఆంధ్రా బిజినెస్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ & ప్రెసిడెంట్ వైబి తువాన్ గణపతిరావు వీరమన్, మలేసియాలో ప్రముఖ సంస్థ అయిన "DHAYA MAJU INFRASTRUCTURE (ASIA)- DMIA గ్రూప్" ఫౌండర్ & గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా.సుబ్రహ్మణ్యం పిళ్లై శుక్రవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.
అమరావతి: ప్రజారాజధాని అమరావతిలో పర్యటించేందుకు మలేసియా బృందం అమరావతికి చేరుకుంది. బృందంలోని సభ్యులైన మలేసియాలోని క్లాంగ్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు, మలేసియా- ఆంధ్రా బిజినెస్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ & ప్రెసిడెంట్ వైబి తువాన్ గణపతిరావు వీరమన్, మలేసియాలో ప్రముఖ సంస్థ అయిన "DHAYA MAJU INFRASTRUCTURE (ASIA)- DMIA గ్రూప్" ఫౌండర్ & గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా.సుబ్రహ్మణ్యం పిళ్లై శుక్రవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. సిఆర్డిఏ అడిషనల్ కమిషనర్ అమిలినేని భార్గవ్ తేజ, సిఆర్డిఏ ఆఫీస్ మేనేజ్‌మెంట్ విభాగ డైరెక్టర్ వల్లభనేని శ్రీనివాసరావు, సిఆర్డిఏ కమ్యూనికేషన్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ జి.రామరాజు, డిప్యూటీ డైరెక్టర్ & దక్షిణాసియా ఇన్వెస్ట్మెంట్ ఇన్‌ఛార్జ్ ఎం. సిద్ధార్థ వర్మ మలేసియా ప్రతినిధులకు స్వాగతం పలికారు. అమరావతిలో పర్యటించేందుకు గన్నవరం విమానాశ్రయంలో అడుగుపెట్టిన మలేసియా ప్రతినిధులకు సిఆర్డిఏ కమ్యూనికేషన్స్ విభాగ అధికారులు, సిబ్బంది శాలువాలతో సత్కరించి ఘనస్వాగతం పలికారు.
అనంతరం రాయపూడిలోని CRDA ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ అమిలినేని భార్గవ్ తేజ మలేసియా బృందంతో సమావేశమై, రాజధాని అమరావతి నిర్మాణ పురోగతి గురించి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, ఫ్రెండ్లీ పాలసీలను అడిషనల్ కమిషనర్ వివరించారు. అలాగే, 2026 జనవరి ప్రథమార్థంలో అమరావతిలో తమ పెట్టుబడుల కార్యాచరణపై కార్యశాల నిర్వహిస్తామని మలేసియా బృందంలోని సభ్యులు స్పష్టం చేశారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని మలేసియా బృందంలోని సభ్యులు CRDA అధికారులకు వెల్లడించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి డా.పొంగూరు నారాయణ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయిలో అత్యుత్తమ మౌలిక వసతులతో నిర్మిచేందుకు కృషి చేస్తున్నారని అడిషనల్ కమిషనర్ తెలిపారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతవరణం ఉందని చెప్పారు. ఇప్పటికే పలు ప్రముఖ విద్యా, వైద్య, ఆర్థిక, పర్యాటక సంస్థలు పెట్టుబడులు పెట్టి, కొన్ని సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. మిగతా సంస్థలు త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయని మలేసియా బృందానికి వివరించారు.