గాంధీ దర్శన్ నుంచి ‘జై భారత్ మూమెంట్’ ప్రారంభం

దేశంలో మతతత్వ శక్తులు విద్వేషాలను రెచ్చగొడుతున్న నేపథ్యంలో, అమరవీరులు అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్ మహాత్మా గాంధీ ఇచ్చిన శాంతి, సామరస్య సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ‘జై భారత్ మూమెంట్’ ప్రారంభమైంది.

Update: 2025-12-20 08:22 GMT

హైదరాబాద్: దేశంలో మతతత్వ శక్తులు విద్వేషాలను రెచ్చగొడుతున్న నేపథ్యంలో, అమరవీరులు అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్ మహాత్మా గాంధీ ఇచ్చిన శాంతి, సామరస్య సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ‘జై భారత్ మూమెంట్’ ప్రారంభమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోని గాంధీ దర్శన్ వేదికగా శుక్రవారం ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఉద్యమం వచ్చే ఏడాది జనవరి 30, 2026 వరకు దేశవ్యాప్తంగా కొనసాగనుంది.

ఈ కార్యక్రమానికి మార్గదర్శిగా రమణ మూర్తి వ్యవహరిస్తుండగా, జై భారత్ మూమెంట్ అధ్యక్షులు ముస్తాక్ అహ్మద్ అభిలావి నేతృత్వంలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రారంభోత్సవ సభలో మౌలానా తఖీ రజా ఆబిదీ, గాంధీ దర్శన్ కార్యదర్శి ప్రొఫెసర్ ప్రసాద్ గోలన్ పల్లి, న్యాయమూర్తి చంద్రకుమార్, మెహదవియా కౌమీ మూమెంట్ అధ్యక్షులు షహబాజ్ అలీ ఖాన్ అమ్జద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, బ్రాహ్మణ సమాజానికి చెందిన ప్రతినిధులు, వివిధ మతాల పెద్దలు ఈ సభకు హాజరై మత సామరస్యంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా షహబాజ్ అలీ ఖాన్ మాట్లాడుతూ, పాతబస్తీలోని ప్రతి గల్లీలోనూ శాంతి, సోదరభావ సందేశాన్ని తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. నేటి యువత గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో లౌకికత్వాన్ని కాపాడటంతో పాటు, గాంధీజీ సిద్ధాంతాలను నమ్మే వారందరినీ ఏకం చేయడమే ‘జై భారత్ మూమెంట్’ ప్రధాన లక్ష్యమని వక్తలు స్పష్టం చేశారు.

Tags:    

Similar News