Phone Tapping Case:తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ పై ఛార్జ్ షీటు

తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ పై ఛార్జ్ షీటు

Update: 2026-02-05 00:56 GMT

Phone Tapping Case:తెలంగాణలో గత కొన్ని రోజులుగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు అత్యంత కీలకమైన మలుపు తిరిగింది. సిట్ దర్యాప్తు తుది దశకు చేరుకోవడమే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లోని దిగ్గజాల పేర్లు చార్జిషీట్‌లో చేరబోతుండటం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెప్తున్న అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి మరో రెండు వారాల్లోనే నేరాభియోగ పత్రం (చార్జిషీట్) దాఖలు చేయాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఈ కేసులో కేవలం కింది స్థాయి అధికారులే కాకుండా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుల పాత్రపై బలమైన సాక్ష్యాధారాలు సేకరించినట్లు సమాచారం. ఈ ముగ్గురితో పాటు సంతోష్ రావు, మరికొందరు ప్రముఖుల పేర్లను కూడా నిందితుల జాబితాలో చేర్చేందుకు రంగం సిద్ధమైంది.

ఈ దర్యాప్తులో అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే.. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అప్రూవర్‌గా మారడం. ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఉపయోగించి, సదరు అధికారి ద్వారా కొన్ని భూముల సెటిల్మెంట్లు, ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సిట్ గుర్తించింది. ఇప్పుడు ఆ అధికారి ఇచ్చే వాంగ్మూలం ఈ కేసులో ప్రధాన నిందితులకు పెను ముప్పుగా మారనుంది. అధికారికంగా మావోయిస్టుల వేట పేరుతో, అనధికారికంగా రాజకీయ ప్రత్యర్థులు, త పార్టీ నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

సిట్ చీఫ్ బుధవారం తన బృందంతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో చార్జిషీట్ దాఖలుకు ముందు చేయాల్సిన తుది కసరత్తుపై చర్చించారు. ఈ చార్జిషీట్ వేసేలోపు మరో ఐదారుగురు కొత్త వ్యక్తులను నిందితుల జాబితాలో చేర్చనున్నారు. ఇందులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కుమారుడు నిశాంత్ రావు పేరు కూడా ఉండే అవకాశం ఉంది. ట్యాపింగ్ ద్వారా లబ్ధి పొందిన వారు, డేటా ధ్వంసంలో సహకరించిన వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు వ్యూహరచన చేస్తున్నారు.

ఈ కేసు కేవలం ఫోన్ వినడానికే పరిమితం కాలేదని, దీని వెనుక భారీ ఆర్థిక కోణం కూడా ఉందని సిట్ బృందం భావిస్తోంది. ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల వ్యూహాలను తెలుసుకోవడంతో పాటు, పారిశ్రామికవేత్తలను బెదిరించి వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వచ్చిన విరాళాలకు, ట్యాపింగ్ కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా లోతుగా దర్యాప్తు చేశారు. ట్యాపింగ్ కు అనుమతులిచ్చిన రివ్యూ కమిటీ అధికారులను సాక్షులుగా మార్చడం ద్వారా కేసును కోర్టులో పక్కాగా నిలబెట్టాలని సిట్ అధికారులు భావిస్తున్నారు.

Tags:    

Similar News