Karimnagar: బుద్ధి మార్చుకోకపోతే క్యాడర్ బుద్ధి చెప్తారు.. సీపీఐ గర్జన!
Karimnagar: కరీంనగర్ జిల్లా సీపీఐలో ముదిరిన ముఠా తగాదాలు. మర్రి వెంకటస్వామి తీరుపై జిల్లా కార్యవర్గం తీవ్ర ఆగ్రహం.
Karimnagar: బుద్ధి మార్చుకోకపోతే క్యాడర్ బుద్ధి చెప్తారు.. సీపీఐ గర్జన!
Karimnagar: భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా నిర్మాణ బాధ్యులపై, జిల్లా కార్యదర్శి పై అనవసరపు అవాకులు, చవాకులు పేలితే సహించేది లేదని సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యవర్గం మర్రి వెంకటస్వామి ని తీవ్రంగా హెచ్చరించింది. జిల్లా పార్టీ తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయాన్ని వ్యక్తిగత దూషణలకు వాడుకోవడం ఆయన అవివేకానికి నిదర్శనమని మండిపడింది. సిపిఐ కరీంనగర్ జిల్లా సమితి విడుదల చేసిన ప్రకటనలో వెంకటస్వామి తీరుపై నిప్పులు చెరిగారు.
గోడ మీద పిల్లి వాటం నీది..
కమ్యూనిస్టు సిద్ధాంతాల గురించి మాట్లాడే నైతిక హక్కు మర్రి వెంకటస్వామికి లేదని పార్టీ స్పష్టం చేసింది. గతంలో క్రమశిక్షణారాహిత్యం కారణంగా పార్టీ నుంచి సస్పెండ్ అయిన విషయం అందరికీ తెలుసు. పార్టీ నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తానని గతంలో చేసిన తప్పులను పునరావృతం చేయనని చెప్పిన నిన్ను అనాటి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న చాడ వెంకట రెడ్డి, జిల్లా పార్టీయే కదా తిరిగి పార్టీలోకి తీసుకున్నది.తీసుకున్న తర్వాత జిల్లా పార్టీకి ఒక్క రోజు కూడా సహకరించలేదు.2022 ఆగస్ట్ లో జరిగిన జిల్లా మహాసభలో వెంకటస్వామి జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఏనాడు చిత్తశుద్ధితో పనిచేయలేదని విమర్శించింది.
గతంలో పార్టీని వీడి సిపిఎం,కాంగ్రెస్‌లో చేరిన చరిత్ర నీది కాదా?
అవకాశవాద రాజకీయాలకు అలవాటు పడి గతంలో సిపిఎం లోకి, ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లి జెడ్పిటిసిగా పోటీ చేసి ఓడిపోయిన చరిత్ర నీది కాదా? అని ప్రశ్నించింది. మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని, అక్కడ పోటీ చేయాలని పార్టీ చెప్పితే పట్టించుకోలేదని,కనీసం పార్టీ నాయకులకు,కార్యకర్తలకు ఏదైనా సమస్య ఉండి ఫోన్ చేస్తే మాట్లాడని, ఫోన్ లిఫ్ట్ చేయని వ్యక్తివి నువ్వు నాయకులను విమర్శించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.
ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడు..
గత మహాసభల నుంచి మర్రి వెంకటస్వామి ఒక "ఇంటి దొంగ"లా వ్యవహరిస్తూ పార్టీ నిర్మాణాన్ని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా సంఘాల్లో విభేదాలు సృష్టించడం,అకారణంగా కమిటీలు రద్దు చేయడం, గ్రూప్ లు కట్టడం,పార్టీ ప్రతిష్టను అప్రతిష్టపాలు చేయడం వంటి అరాచక చర్యలకు పాల్పడుతున్నందునే జిల్లా సమితి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని తెలిపింది.
హుజురాబాద్ శాసన సభ ఉప ఎన్నికల్లో,సాధారణ ఎన్నికల్లో అలాగే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి బీజేపీ,బిఆర్ఎస్ నేతలతో రహస్య మంతనాలు జరిపిన చరిత్ర ఉన్న వెంకటస్వామి సిద్దాంతాలు,విలువలు కలిగిన పార్టీని,వ్యక్తులను దూషించడం మానుకోవాలి అని మండిపడ్డారు.
షోకాజ్ నోటీసు ఇచ్చినా సరైన సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్న వెంకటస్వామి, ఇప్పుడు సాకులు వెతుక్కోవడం సిగ్గుచేటని అన్నారు.
చాడ వెంకటరెడ్డిపై అక్కసు ఎందుకు?
అపారమైన రాజకీయ అనుభవం,రాష్ట్ర కార్యదర్శిగా,సిపిఐ ఫ్లోర్ లీడర్ గా పనిచేసి,ఎన్నో పోరాటాలు చేసిన ఉద్యమ నేత చాడ వెంకటరెడ్డిపై కావాలనే విషం చిమ్ముతున్నారని, ఇది పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని కార్యవర్గం స్పష్టం చేసింది. ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శి ఆదేశాల మేరకు నాలుగు నెలల పాటు వేచి చూసినా, వెంకటస్వామి వ్యవహార శైలిలో మార్పు రాకపోగా,ఏకంగా పార్టీ నాయకులపై పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టించి,నాయకుల కుటుంబాల మధ్య చిచ్చు పెట్టించే స్థాయికి దిగజారారని మండిపడింది.
ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే జిల్లాలో పార్టీ కార్యకర్తలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించింది. నిజాయితీ, నిబద్ధతకు నిలువుటద్దమైన చాడ వెంకట్ రెడ్డి పై వ్యక్తిగత ఆరోపణలు,విమర్శలు చేస్తే ఊరుకోం అని హెచ్చరించారు. మర్రి వెంకటస్వామి పై పార్టీ నిర్ణయం రాజ్యాంగబద్ధమని, దీనిని ఎవరూ ప్రశ్నించలేరని జిల్లా కార్యవర్గ సభ్యులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందె స్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్,బత్తుల బాబు, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బోయిని తిరుపతి, న్యాలపట్ల రాజు.భారత కమ్యూనిస్టు పార్టీ. కరీంనగర్ జిల్లా సమితి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.