రేవంత్ రెడ్డి 'హార్వర్డ్ సర్టిఫికెట్'పై రచ్చ: ఆ సర్టిఫికెట్ వెంటనే రద్దు చేయండి.. వర్సిటీకి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఘాటైన లేఖ!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంతర్జాతీయ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ ఇటీవల జారీ చేసిన సర్టిఫికెట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంతర్జాతీయ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ ఇటీవల జారీ చేసిన సర్టిఫికెట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. రేవంత్ రెడ్డికి ఇచ్చిన ఆ సర్టిఫికెట్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హార్వర్డ్ వర్సిటీ పూర్వ విద్యార్థి, బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గురువారం హార్వర్డ్ అధ్యక్షుడు, డీన్‌లకు ఘాటైన ఈ-మెయిల్ పంపారు.
89 క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తికి సర్టిఫికెటా?
హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో '21వ శతాబ్దంలో నాయకత్వం' అనే ప్రోగ్రామ్‌లో రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ పొందడంపై ప్రవీణ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలోనే ఏ ముఖ్యమంత్రిపై లేనన్ని (89) క్రిమినల్ కేసులు రేవంత్ రెడ్డిపై ఉన్నాయని, అందులో 72 తీవ్రమైన ఐపీసీ సెక్షన్ల కింద నమోదైనవని ఆయన తన లేఖలో ప్రస్తావించారు.
ఓటుకు నోటు కేసును గుర్తు చేస్తూ..
2015లో 'ఓటుకు నోటు' కేసులో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికి, 50 రోజుల పాటు జైలు జీవితం గడిపిన వ్యక్తికి హార్వర్డ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ సర్టిఫికెట్ ఇవ్వడం సంస్థాగత బాధ్యతారాహిత్యమేనని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రసంగాల్లో వాడే భాష, ఆయన రాజకీయ నేపథ్యం హార్వర్డ్ నేర్పే నైతిక విలువలకు విరుద్ధమని ఆరోపించారు. కేవలం ఫీజుల కోసమో, ప్రతిష్ట కోసమో నేపథ్య విచారణ చేయకుండా ఇలాంటి వారికి సర్టిఫికెట్లు 'అమ్ముకోవడం' హార్వర్డ్ ప్రతిష్టకే సిగ్గుచేటని ప్రవీణ్ కుమార్ తన లేఖలో నిప్పులు చెరిగారు. ఈ సర్టిఫికెట్‌ను రద్దు చేయకుంటే హార్వర్డ్ విలువలకే ముప్పు వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు.