సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలపై టీటీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. దీంతో టీటీడీపీ రాష్ట్ర కమిటి నిన్న అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. మోత్కుపల్లి మాటలపై అందరీ అభిప్రాయం తీసుకోని జాతీయ కమిటికి నివేదిక పంపింది. మోత్కుపల్లిపై పార్టీ అధినేత చంద్రబాబు వేటు వేస్తారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ టీడీపీలో ఏదో కలకలం రేగుతూనే ఉంది. టీఆర్ఎస్ లోకి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఫిరాయించిన చేరిన తర్వాత ఆ పార్టీ బలహీనమైంది. దిక్కు అనుకున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఎన్టీఆర్ వర్థంతి నాడు ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ లో టీటీడీపీని విలీనం చేయాలని డిమాండ్ చేశారు. మోత్కుపల్లి వ్యాఖ్యలపై టీటీడీపీ రాష్ట్ర కమిటి రెండు రోజులు గడుస్తున్నా తగిన కౌంటర్ ఇవ్వకపోవడంపై టీడీపీ జాతీయ కమిటీ సీరియస్ అయింది.
మోత్కుపల్లి మాటలపై హై కమాండ్ గరం గరం కావడంతో టీటీడీపీ అధ్యక్షుడు రమణ అత్యవసరంగా సెంట్రల్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. హాట్ హాట్ గా సాగిన ఈ సమావేశంలో మోత్కుపల్లి పై చర్యలు తీసుకోవాల్సిందే అని రేవురి ప్రకాష్ రెడ్డి పట్టుబట్టారు. అయితే, పెద్దిరెడ్డి ఆవేశంగా మాట్లాడి... మోత్కుపల్లిని వెనుకేసుకొచ్చారు. మోత్కుపల్లి తీరుతో పాటు పార్టీలోని పరిస్థితి గురించి నివేదిక రూపంలో అధిష్టానానికి నివేదించారు రమణ. తెలంగాణ తాజా రాజకీయ పరిణాలపై వెంటనే రిపోర్టు పంపించాలని రమణను సెంట్రల్ కమిటీ ఆదేశించింది. మోత్కుపల్లి వ్యవహారంపై నివేదిక పంపిన టీటీడీపీ...మోత్కుపల్లిపై పార్టీ అధినేత చంద్రబాబు సస్పెన్షన్ వేటు వేయడం ఖాయమని భావిస్తోంది.