మరికాసేపట్లో సీఐడీ కస్టడీకి ఎంసెట్ 2 నిందితులు

Update: 2018-07-13 06:05 GMT

రెండేళ్లుగా ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు చందంగా సాగుతున్న ఎంసెట్‌ లీకేజీ కేసును వేగవంతం చేయాలని సీఐడీ అధికారులు నిర్ణయించారు. పాత్రదారులు వెనకనున్న అసలు సూత్రధారుల బండారం బయట పెట్టేందుకు సిద్ధం అయ్యారు.    
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం స్పష్టించిన ఎంసెట్ 2 కేసులో వీలైనంత త్వరలో చార్జ్ షీట్ దాఖలు చేయాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు.  కేసు దర్యాప్తులో ఇప్పటికే బ్రోకర్లు , సబ్ బ్రోకర్లు , ఏజెంట్లుగా ఉన్న 90 మందిని అరెస్ట్ చేసిన  సీఐడీ కీలక నిందితులను గత వారంలో అదుపులోకి తీసుకుంది. ఇందులో కార్పొరేట్  కాలేజ్ డీన్ వాసుబాబుతో పాటు  ప్రముఖ కాలేజీల ఏజెంట్‌  వెంకట శివ నారాయణలు ఉన్నారు. ఈ కేసులో వీరిని ప్రధాన పాత్రధారులుగా భావిస్తున్న అధికారులు పూర్తి స్ధాయిలో విచారించాలని నిర్ణయించారు. ఇందుకోసం నాంపల్లి కోర్టు నుంచి ఆరు రోజుల అనుమతి కూడా తీసుకున్నారు.  

ఈ స్కామ్ లో ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నా పత్రాలు లీక్ అయినట్టు  సిఐడీ గుర్తించింది.  ఈ వ్యవహారంలో కీల‌క సూత్రధారి సింగ్ అరెస్టు కావ‌డంతో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. దీని ఆధారంగానే వాసుబాబు, వెంకట శివ నారాయణలను అదుపులోకి తీసుకున్నారు.  అయితే లీకేజీ వ్యవహారంలో యాజమాన్యాల ప్రమేయం ఉందా ? లేక సొంతంగానే  వ్యవహారాన్ని నడిపారా ? లేక  మరేవరయినా వీరిని పావులుగా వాడుకున్నారా ? అనే కోణంలో సీఐడీ విచారణ జరపనుంది. ఇప్పటికే వీరిద్దరి కాల్ డేటాను సేకరించిన అధికారులు పలు కోణాల్లో అంతర్గత  విచారణ పూర్తి చేశారు. నిందితులను ప్రశ్నించాల్సిన అంశాలపై ప్రత్యేక జాబితా సిద్ధం చేసిన అధికారులు విచారణను వీడియో తీయాలని భావిస్తున్నట్టు సమాచారం. నిందితులు వెల్లడించే అంశాల ఆధారంగా మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశముందని భావిస్తున్నారు. కార్పోరేట్‌ కాలేజీల హస్తముందని ప్రచారం జరుగుతూ ఉండటంతో  ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఉత్కంఠ రెండు రాష్ట్రాల్లోనూ నెలకొంది. 
 

Similar News