రెండు రాష్ట్రాల్లో కచ్చితంగా పోటీ చేస్తాం: పవన్

Update: 2018-01-22 13:01 GMT

కరీంనగర్‌లో నిర్వ‌హించిన‌ ప్రెస్ మీట్ లో ప‌వ‌న్ మాట్లాడుతూ.... తెలంగాణ‌లో ఎటువంటి స‌మ‌స్య‌లు ఉన్నాయో తెలుసుకుంటానని చెప్పారు. తాను ఇరు రాష్ట్రాల్లో ఏదో ఒక సమస్యపై పోరాడుతూనే ఉంటాన‌ని చెప్పారు. అయితే, తెలంగాణకు సంబంధించినంత వరకు ఈ రాష్ట్రంలో ఆలోచించి అవగాహన తెచ్చుకున్న తరువాత ముందడుగు వేయాల్సి ఉంటుంద‌ని తెలిపారు. తెలంగాణ‌లోని స‌మ‌స్య‌ల‌పై త‌మ‌ బృందం అధ్య‌య‌నం చేస్తోందని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తామని మరోసారి ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఎన్నికలకు ముందు ఎన్ని సీట్లలో పోటీ చేస్తామనేది స్పష్టత వస్తుందని చెప్పారు. కార్యకర్తల సూచన మేరకు.. ఎక్కడ బలం ఉంది.. ఎక్కడ పోటీ చేయగలం అన్న దాన్ని బట్టి పోటీ ఉంటుందని అన్నారు.
 
తాను నిర్మాణాత్మక రాజకీయాలే చేస్తానని.. ప్రజా ఉపయోగ కార్యక్రమాలే చేపడతామన్నారు. ఎవరికోసమో తాను పనిచేయడం లేదని... టీడీపీ, బీజేపీలకు సదుద్దేశంతోనే మద్దతు పలికాను అన్నారు. తెలంగాణలో సమస్యలు చాలా ఉన్నాయన్నారు. అనేక దశాబ్దాల తర్వాత తెలంగాణ వచ్చిందని.. బాధ్యతతోనే తాను ప్రవర్తిస్తాను అన్నారు. ఎలా పడితే అలా తాను మాట్లాడలేనని అన్నారు. విమర్శల కోసం తాను పని చేయను అని చెప్పారు. సమస్యలను అర్థం చేసుకుని.. ప్రభుత్వాల దగ్గరకు తీసుకువెళతాను అన్నారు. ఇన్ని సీట్లు.. ఓట్లు అనే లెక్కతో వెళ్లడం లేదని చెప్పారు పవన్. కొన్నేళ్లు నడవాలనే ఆలోచనతో ప్రయాణిస్తున్నామని.. ఏ పార్టీ అయినా నాయకుడి కేంద్ర బిందువుగానే సాగుతుందని అన్నారు.
 

Similar News