కేసీఆర్ ఢిల్లీకి పోతే.. మరి తెలంగాణకు ఎవరు?!

Update: 2018-03-05 06:37 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. జాతీయ రాజకీయాలపై ఆసక్తితో ఉన్నట్టు స్పష్టమైంది. ఇకపై ఆయన ఎక్కువ సమయాన్ని ఢిల్లీకే కేటాయించబోతున్నట్టుగా ఆయనే స్పష్టం చేయడంతో.. మరి రాష్ట్రంలో టీఆర్ఎస్ ను నడిపించేది ఎవరు అన్న చర్చ కూడా మొదలైంది. ఇప్పటికిప్పుడు కేసీఆర్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోయినా.. ముందు ముందు ఎవరు అన్న ప్రశ్నలు ఉదయించడాన్ని మాత్రం ఆయన ఆపలేరు.

ఇప్పటివరకూ తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయాల తీరును గమనించే వారికి మాత్రం ఓ విషయం స్పష్టమవుతోంది. గడచిన మూడేళ్లుగా.. తన వారసుడిగా.. కుమారుడు, మంత్రి కేటీఆర్ ను ప్రొజెక్ట్ చేయడంలో కేసీఆర్ చాలా వరకు సఫలీకృతులయ్యారు. ఎవరు స్వాగతించినా.. ఎవరు స్వాగతించకపోయినా.. కేటీఆరే రాజకీయంగా కూడా కేసీఆర్ వారసుడు అన్న మాటను.. జనంలోకి తీసుకెళ్లగలిగారు.

కానీ.. ఇక్కడ సీనియర్ నాయకుడు, మంత్రి, టీఆర్ఎస్ తురుపుముక్క హరీష్ రావు గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి ఉంది. టీఆర్ఎస్ ఆవిర్బావం నుంచి.. ఇప్పటివరకూ పార్టీ ఎదిగే ప్రతి క్రమంలో హరీష్ ముద్ర ఉంది. ఒక్కోసారి కేసీఆర్ కంటే కూడా ఎక్కువగా హరీష్.. పార్టీ కోసం శ్రమించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటివరకూ.. ఈ విషయంలో అధినేత మాటను కాదనకుండా పని చేస్తూ.. మౌనాన్ని వీడకుండా వచ్చిన హరీష్.. ముందు ముందు కేటీఆర్ నాయకత్వంలో పని చేయగలగరా? అన్నది కూడా చర్చనీయాంశమైంది.

ఈ రెండు విషయాల్లో క్లారిటీ వస్తే.. ఇక కేసీఆర్ పూర్తిగా జాతీయ రాజకీయాలకే సమయం కేటాయించే అవకాశం కలుగుతుందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. కానీ.. ఈ విషయంలో స్పష్టత రావాలంటే.. మరింత సమయం పట్టేలా ఉంది.
 

Similar News