ఆగస్టు 15 నుంచి తెలంగాణలో రైతు బీమా పథకం

Update: 2018-06-04 11:42 GMT

రైతు బీమా పథకం.. తాను చేసిన గొప్పపని అన్నారు సీఎం కేసీఆర్‌. ఆగస్టు 15 నుంచి రైతు బీమా అమలవుతుందని చెప్పారు. రైతు ఎలా మరణించినా 10 రోజుల్లోనే బాధిత కుటుంబానికి.. 5 లక్షల బీమా అందుతుందన్నారు కేసీఆర్. దీనికి సంబంధించి.. తెలంగాణ ప్రభుత్వం ఎల్ఐసీతో ఒప్పందం కుదుర్చుకుంది.

రైతు క్షేమంగా ఉంటేనే దేశాభివృద్ధి జరుగుతుందన్నారు సీఎం కేసీఆర్. హెచ్ఐసీసీలో జరిగిన రైతు సమన్వయకమిటీ కార్యక్రమంలో.. రైతు బీమా పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎల్ఐసీతో ఎంవోయూ కుదుర్చుకుంది. ఆగస్టు 15 నుంచి రైతుబీమా పథకం అమలవుతుందన్నారు సీఎం కేసీఆర్. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న రైతులందరికీ రైతుబీమా పథకం వర్తిస్తుందన్నారు కేసీఆర్. రైతు మరణించిన 10 రోజుల్లోనే పాలసీ క్లెయిమ్ అవుతుందని, ఆగస్టు 15 లోపు అప్లికేషన్లు నింపి ఎల్‌ఐసీకి అందజేయాలని వ్యవసాయశాఖ అధికారులను సీఎం ఆదేశించారు.

డిమాండ్ ఉన్న పంటలనే రైతులు పండించాలని కేసీఆర్ సూచించారు. పక్క రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకునే దుస్థితి పోవాలన్నారు. నేను తెలంగాణ రైతునని గర్వంగా చెప్పుకునే రోజులు రావాలని ఆకాంక్షించారు. రైతుబంధు పథకంలో.. కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వమని తేల్చేశారు కేసీఆర్. సీఎం కేసీఆర్ నిజమైన రైతుబంధు అన్నారు ఎల్‌ఐసీ చైర్మన్ వీకే శర్మ. రైతుల కోసం ఒప్పందం  కుదుర్చుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. రైతుల కోసం సీఎం ఎంతో కష్టపడుతున్నారని.. కేసీఆర్ విజన్ ఉన్న లీడర్ అన్నారు వీకే శర్మ. తెలంగాణ రైతుల తరపున ఎల్‌ఐసీకి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు‌. ఈ ఒప్పందం కుదుర్చుకోవడం తనకెంతో సంతోషంగ ఉందన్నారు సీఎం. 

Similar News