ఇందారంలో సంచలనంగా నమోదైన ఈ ఘటనపై ఆసక్తికరమైన...

Update: 2018-09-13 05:09 GMT

ఇందారంలో బాల్క సుమన్‌పై హత్యాయత్నం జరిగిందా? లేదంటే ఓదేలుకు సీటు రాలేదన్న బాధతో ఆయన వర్గీయుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడా? రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా, ఇందారంలో సంచలనంగా నమోదైన ఈ ఘటనపై ఆసక్తికరమైన సంగతులు బయటపడుతున్నాయి. 

చెన్నూరు టిక్కెట్‌ తనకు రాలేదన్న బాధతో ఉన్న ఓదేలు కొన్నాళ్ల నుంచి అసంతృప్తిగా ఉన్నారు. తన అసమ్మతిరాగాన్ని అధినేతకు కూడా వినిపించారు. ఇంతలోనే సుమన్‌పై ఎదురైన చేదు అనుభవం ఓదేలు కేంద్రంగా చక్కర్లు కొడుతుంది. కావాలనే తనపై హత్యాయత్నం చేయించారన్న సుమన్‌ వర్గీయుల ఆరోపణ రాజకీయంగా సరికొత్త అస్త్రాన్ని సంధించినట్టయింది. 

 చెన్నూరులో టీఆర్‌ఎస్‌ అసమ్మతి రాజకీయానికి అంటుకుంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే నల్లాల ఓదేలును కాదని పెద్దపల్లి ఎంపీగా ఉన్న బాల్కసుమన్‌ను చెన్నూరు అసెంబ్లీ నుంచి రంగంలోకి దించడంతో అసమ్మతి జ్వాలలు రంగులు మారాయి. మంచిర్యాల జిల్లా ఇందారంలో ఎన్నికల ర్యాలీ ఆ తర్వాత బహిరంగ సభ కోసం వచ్చిన బాల్క సుమన్‌ కొందరు స్థానికులు అడ్డుకున్నారు. సుమన్‌ గో బ్యాక్‌ అంటూ నినదించారు. 

తనను అడ్డుకున్నది ఓదేలు వర్గీయులేనంటూ సుమన్‌ ఆరోపణలు చేస్తుండగానే గట్టయ్య అనే వ్యక్తి తనపై పెట్రోలు చల్లుకుంటూ సుమన్‌పైనా చల్లారు. ఆ వెంటనే నిప్పు అంటించుకున్నారు. గన్‌మెన్లు, కార్యకర్తలు అప్రమత్తం అవడంతో సుమన్‌ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారంటున్నారు ఆయన వర్గీయులు. 

ప్రత్యక్ష సాక్షి, బాల్కసుమన్‌ అనుచరుడు జైనుద్దీన్‌ మాటల ప్రకారమైతే.. పక్కా స్కెచ్‌ ప్రకారమే సుమన్‌పై హత్యాయత్నం జరిగిందంటున్నారాయన. గట్టయ్య అనే ఓదేలు వర్గీయుడు కావాలనే సుమన్‌పై పెట్రోలు చల్లి నిప్పంటించే ప్రయత్నం చేశారంటున్నారు జైనుద్దీన్‌. ఇందారం వార్డు వన్‌ మెంబర్‌గా తాను సుమన్‌ను తన ప్రాణాలను పణంగా పెట్టి సుమన్‌ను కాపాడిననని అంటున్నారు. 

కారణాలు ఏం చెబుతున్నా... సుమన్‌పై హత్యాయత్నం జరిగిందంటున్నారు ఆయన వర్గీయులు. తమకు ఆ అవసరం లేదంటున్నారు ఓదేలు వర్గీయులు. ఏమైనా మొత్తానికి ఇందారంలో బాల్క సుమన్‌కు ఎదురైన చేదు అనుభవం గురించి రాజకీయాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ సుమన్‌పై జరిగింది హత్యాయత్నమా? ఓదేలుకు టిక్కెట్‌ రాలేదన్న బాధతో ఆయన వర్గీయుడు చేసుకున్న ఆత్మహత్యాయత్నమా? దర్యాప్తులోనే అసలు నిజాలు తెలిసేవి. 

Similar News