తెలంగాణ ఆపధ్ధర్మ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట

Update: 2018-10-12 10:37 GMT

తెలంగాణ ఆపధ్ధర్మ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. అసెంబ్లీ రద్దు రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్లు ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. అసెంబ్లీ రద్దుపై కాంగ్రెస్ నేత డీకె. అరుణతో పాటు పలువురు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. రాజ్యాంగ బద్ధంగా అసెంబ్లీ రద్దు జరగలేదంటూ పిటిషనర్లు చేసిన వాదనలను తోసిపుచ్చింది. అసెంబ్లీ రద్దుకు సంబంధించి ప్రభుత్వ న్యాయవాదులు చేసిన వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. 

తెలంగాణ శాసనసభ రద్దును సవాల్ చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ, లాయర్ శశాంక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను రెండు సార్లు హైకోర్టు విచారించింది. గత బుధవారం సుదీర్ఘంగా వాడివేడిగా వాదనలు జరిగాయి. తెలంగాణ అసెంబ్లీ రద్దు తీరు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పిటిషన్లు తెలిపారు. సభ రద్దుపై గవర్నర్ రాజ్యాంగం ప్రకారం నిర్ణయం తీసుకోలేదనీ క్షణాల్లో మంత్రి మండలి తీర్మానాన్ని ఆమోదించారని పిటిషనర్ల  తరపు న్యాయవాదులు వాదించారు. 

శాసనసభను సమావేశపరచకుండా అసెంబ్లీని రద్దు చేయడం వల్ల ఎమ్మెల్యేల  హక్కులను కాలరాయడమేనని పిటిషనర్ల  తరపు న్యాయవాదులు ఆరోపించారు. అయితే ప్రభుత్వానికి బాధ్యత వహించే మంత్రి మండలి ఆమోదంతోనే సభను రద్దు చేసినట్టు అడ్వకేట్ జనరల్‌ కోర్టుకు విన్నవించారు. బుధవారం ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసి ఇవాళ తీర్పును వెలువరించింది.  అసెంబ్లీ రద్దుపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కోట్టివేయయడంతో ఎన్నికలకు ప్రక్రియకు లైన్ క్లియర్ అయినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు.

Similar News