బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో మరో అపచారం

Update: 2018-06-30 11:19 GMT

బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా అమ్మవారి ఆలయంలో మరో అపచారం జరిగింది. రాజగోపురాలకు మరమ్మత్తులో భాగంగా వాటిపై పెట్టే కలశాలు మాయమయ్యాయి. రెండు రాజగోపురాలపై ఉండాల్సిన కలశాలను కోతులు ఎత్తుకెళ్లాయని అధికారులు చెప్తున్నారు. ఈ సమాధానంతో అంతా అవాక్కయ్యారు. కోతులు ఎత్తుకెళ్లడమేంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలశాలు మాయమైన ఘటనకు సంబంధించి బాసర ఆలయ అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా ఉండటమేంటని ప్రశ్నిస్తున్నారు. పంచలోహ కలశాలు పోవడం అపవిత్రమని భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు. 

బాసర ఆలయంలో 3 రోజులుగా శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతి విదుశేఖర భారతీ స్వామీ మహా కుంభాభిషేకాన్ని నిర్వహిస్తున్నారు. అమ్మవారి విగ్రహంతో పాటు రాజగోపురాలకు విశేష పూజలు నిర్వహించిన జలాలలో అభిషేకం నిర్వహించారు. కానీ అధికారుల నిర్లక్ష్యంతో రాజగోపురాలకు, వాటిపై ఉండాల్సిన కొత్త కలశాలకు అభిషేకం నిర్వహించలేకపోయారు. దీంతో పూజారులు, అధికారుల తీరుపై శృంగేరి పీఠాధిపతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అప్పట్లో బాసర ఆలయ పూజారి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పొలిమేరలు దాటించడం పెద్ద సంచలనం రేపింది. ఆ వివాదం మరువక ముందే పంచలోహ కలశాలు పోవడం అందరినీనివ్వెరపరుస్తోంది. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే సరస్వతిదేవీ ఆలయంలో ఇలాంటి అపచారాలు జరగడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు నిర్లక్ష్యంగా కలశం కోతి ఎత్తుకెళ్లిందని చెప్పడం భక్తులకు ఆగ్రహం తెప్పిస్తోంది.

Similar News