నిరుద్యోగ భృతి రూ.3,016: కేసీఆర్‌

Update: 2018-10-17 03:28 GMT

గులాబీ బాస్‌ కేసీఆర్‌‌... టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో టీజర్ వదిలారు. పాక్షిక మేనిఫెస్టోలోనే వరాల జల్లు కురిపించారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా పథకాలను ప్రకటించిన కేసీఆర్... దసరా తర్వాత పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు. ఓట్ల కోసం కాకుండా అమలుకు వీలయ్యే అంశాలనే హామీలుగా ప్రకటిస్తామని కేసీఆర్ చెప్పారు. ఎన్నికలంటే ఇతర పార్టీలకు ఆట లాంటిదని.... కానీ టీఆర్‌ఎస్‌కు మాత్రం టాస్క్ వంటిదన్నారు.రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగికి నెలకు రూ.3016 భృతి అందజేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు.‘‘ గతంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వేతో రాష్ట్రవ్యాప్తంగా 11-12 లక్షల మంది నిరుద్యోగులు ఉండవచ్చని అంచనా. వీరే కాదు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నా అందరికీ నెలకు రూ.3016 నిరుద్యోగ భృతి అందిస్తాం. అసలు నిరుద్యోగులు ఎవరు అని గుర్తించడమనేది పెద్ద సమస్య. ప్రస్తుతం ఇది రెండు మూడు రాష్ట్రాల్లో అమల్లో ఉన్నందున అక్కడ కూడా అధ్యయనం చేస్తాం’’ అని కేసీఆర్‌ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికలు కాగానే పంచాయతీ ఎన్నికలు, తర్వాత సాధారణ ఎన్నికలు ఉన్నాయని, ఇవన్నీ పూర్తయ్యేందుకు కాస్త సమయం పడుతుందని కేసీఆర్‌ పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉన్నందున నిరుద్యోగ భృతి ఇవ్వడం మూడు నాలుగు నెలలు ఆలస్యమైనా ఇచ్చి తీరుతామని చెప్పారు.

Similar News