Nara Lokesh: పుట్టపర్తి ట్రిపుల్ ఐటీపై అసెంబ్లీలో మంత్రి లోకేశ్ క్లారిటీ

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రశ్నోత్తరాల సమయం గురువారం పలు ప్రజా సమస్యలపై చర్చకు వేదికైంది.

Update: 2026-02-12 05:59 GMT

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రశ్నోత్తరాల సమయం గురువారం పలు ప్రజా సమస్యలపై చర్చకు వేదికైంది. రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన నుంచి తాగునీటి సమస్యల వరకు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సుదీర్ఘంగా సమాధానమిచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా పలు విద్యాసంస్థల్లో వసతుల మెరుగుదల కోసం ఇప్పటికే ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. త్వరలోనే పనులు పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పుట్టపర్తిలో ట్రిపుల్ ఐటీ (IIIT) ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి కోరగా.. ప్రస్తుతం అటువంటి ప్రతిపాదన లేదని, అయితే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని లోకేశ్ సమాధానమిచ్చారు.

తిరుపతికి భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో తాగునీటి అవసరాలు పెరిగాయని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సభ దృష్టికి తెచ్చారు. గాలేరు నగరి, హంద్రీనీవా ప్రాజెక్టుల ద్వారా నీటి సరఫరాను పరిశీలించాలని కోరారు. దీనిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందిస్తూ.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి సరఫరాను పెంచుతామని భరోసా ఇచ్చారు.

బొబ్బిలి నియోజకవర్గంలోని లోచర్ల శివదావలస ఎత్తిపోతల పథకం పనులు నిలిచిపోవడంపై మంత్రి రామానాయుడు మాట్లాడుతూ.. గత వైసీపీ హయాంలో టెండర్లు రద్దు చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. అలాగే, గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగుల బదిలీల సమస్యపై మంత్రి సంధ్యారాణి స్పందిస్తూ.. గత ప్రభుత్వం కోర్టు కేసుల పరిష్కారంలో చొరవ చూపకపోవడం వల్లే సమస్యలు జటిలమయ్యాయని, కూటమి ప్రభుత్వం వీటిపై త్వరితగతిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

Tags:    

Similar News