April Weather: మాడ్చేసే ఎండలు.. పలకరించే జల్లులు..ఏప్రిల్ నెల వాతావరణం..
April Weather: ఏప్రిల్ నెలలో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని ఐఎండీ వెల్లడించింది. అదేవిధంగా అప్పుడప్పుడు వర్షాలు పడే అవకాశమూ ఉందని సూచించింది.
April Weather
April Weather: ఏప్రిల్ నెల వచ్చేసింది. ఎండాకాలం ప్రారంభం అయిపోయినట్టే. ఈ నెలలో వాతావరణం ఎలా ఉండబోతోంది? తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం ఏ రేంజిలో ఉంటుంది? ఈ వివరాలతో తాజా నివేదికను భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేసింది. దాని ప్రకారం ఈ ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత గణనీయంగా పెరగనుంది. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తీవ్రమైన ఎండలతో పాటు.. ఏప్రిల్ నెలలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని ఐఎండీ పేర్కొంది. వాతావరణంలో ఏర్పడే మార్పుల వల్ల సాయంత్రం వేళల్లో ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు. మొత్తంమీద చూసుకుంటే ఏప్రిల్ నెలలో ఆంధ్ర ప్రదేశ్ లో భానుడి భగభగలు గట్టిగానే ఉండే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఎండలు అదిరిపోతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదు అవుతున్నాయి. సాధారణంగా మే నెలలో రికార్డయే ఉష్ణోగ్రతలు ఇప్పుడే కనిపిస్తున్నాయి. ఉత్తర కోస్తాలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వాతావరణంలో తేమ శాతం పెరగడంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నెలంతా కూడా అదే పరిస్థితి ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇక ఉభయగోదావరి జిల్లాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది.
రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. నిన్న నంద్యాల జిల్లాలో అత్యధికంగా 40.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
తెలంగాణాలో..
ఇక తెలంగాణాలో కూడా ఏప్రిల్ నెలలో ఎండలు దంచి కొట్టే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పగలంతా వేడి వాతావరణం ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే సాయంత్రం సమయంలో అక్కడక్కడా చిరుజల్లులు.. ఓ మోస్తరు వర్షం కురిసి ఉపశమనం కలిగిస్తోంది. దాదాపుగా ఇదే విధమైన వాతావణం ఏప్రిల్ నెలలో కూడా ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది. కాకపోతే, ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది.
ఏప్రిల్ మొదటి వారంలో ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండకపోయినా.. రెండో వారం నుంచి భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవ్వవచ్చు. సాధారణం కంటే 2-4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు ఉండవచ్చు. అదేవిధంగా సాధారణంగా ఏప్రిల్ నెలలో కురిసే వర్షపాతం కంటే, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వర్షాలు కూడా అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంటోంది. అయితే, పగటి పూట ఉష్ణోగ్రతల కంటే, రాత్రిపూట సాధారణ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది