PKBS vs GT: ముందుగా మురిపించి, ఆపై తేలిపోయిన గుజరాత్ బ్యాటర్లు.. పంజాబ్ లక్ష్యం ఏంటంటే?
PBKS vs GT IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా ముల్లన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162రన్స్ చేసింది.
PBKS vs GT IPL 2026
PBKS vs GT IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా ముల్లన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162రన్స్ చేసింది. పంజాబ్ ముందు 163 పరుగుల సాధారణ లక్ష్యం ఉంది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (39; 27 బంతుల్లో 6×4) టాప్ స్కోరర్. ఇంగ్లాండ్ బ్యాటర్ జోస్ బట్లర్ (38; 33 బంతుల్లో 3×4, 2×6), న్యూజీలాండ్ హిట్టర్ గ్లెన్ ఫిలిప్స్ (25) పర్వాలేదనిపించారు. మిగతా గుజరాత్ బ్యాటర్లు తేలిపోయారు. పంజాబ్ బౌలర్లలో విజయకుమార్ వైశాఖ్ మూడు వికెట్స్ తీయగా.. యుజ్వేంద్ర చాహల్ రెండు వికెట్స్ తీశాడు.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ ధాటిగా ఆడారు. తొలి ఓవర్‌లో 9, రెండో ఓవర్లో 14 రన్స్ పిండుకున్నారు. ముఖ్యంగా గిల్ ధాటిగా ఆడడంతో మూడు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోర్ 35/0గా ఉంది. యాన్సెన్ బౌలింగ్‌లో (3.4) శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి సాయి వెనుదిరిగాడు. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. దాంతో హిట్టర్ జోస్ బట్లర్ వేగంగా ఆడలేకపోయాడు. గిల్ మాత్రం బౌండరీలు బాదుతూ స్కోర్ వేగాన్ని పెంచాడు. 10 ఓవర్లో గిల్ (39) కూపర్ కానెల్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 10 ఓవర్లకు గుజరాత్ స్కోర్ 84/2గా నిలిచింది.
హిట్టర్లు జోస్ బట్లర్, గ్లెన్ ఫిలిప్స్ క్రీజులో ఉన్నా గుజరాత్ పరుగుల వేగం మందగించింది. 14వ ఓవర్లో గ్లెన్ ఫిలిప్స్ (25) మార్కో యాన్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాసేపటికే బట్లర్ కూడా అవుట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ (16), షారుఖ్ ఖాన్ (4) నెమ్మదిగా ఆడడంతో రన్ రేట్ పూర్తిగా పడిపోయింది. పంజాబ్ బౌలర్లు పుంజుకోవడంతో రాహుల్ తేవాతియా (11) కూడా ధాటిగా ఆడలేకపోయాడు. ఇన్నింగ్స్ చివరలో అర్షదీప్ సింగ్ ఎక్కువగా అదనపు రన్స్ ఇవ్వడంతో గుజరాత్ స్కోర్ 160 దాటింది. ముందుగా మురిపించిన గుజరాత్ బ్యాటర్లు.. ఆపై తేలిపోవడంతో మోస్తరు స్కోరుకే పరిమితం అవ్వాల్సి వచ్చింది.