IPL 2026 : చితకొట్టిన వైభవ్ సూర్యవంశీ.. సీఎస్కే పై ఆర్ఆర్ ఘన విజయం

RR vs CSK : ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ శుభారంభం చేసింది. వైభవ్ సూర్యవంశీ 15 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదగా, చెన్నైపై 8 వికెట్ల తేడాతో రాయల్స్ ఘనవిజయం సాధించింది.

Update: 2026-03-31 01:39 GMT

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌ను రాజస్థాన్ రాయల్స్ కళ్లు చెదిరే విజయంతో ప్రారంభించింది. గువహటి వేదికగా జరిగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి, మిగతా జట్లకు బలమైన హెచ్చరికలు పంపింది. కొత్త కెప్టెన్ రియాన్ పరాగ్ నాయకత్వంలో రాయల్స్ పక్కా ప్లాన్‌తో బరిలోకి దిగి విజేతగా నిలిచింది. మార్చి 30, సోమవారం నాడు జరిగిన ఈ మూడో ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కొత్త కెప్టెన్ రియాన్ పరాగ్ తన సొంత గడ్డపై తీసుకున్న ప్రతి నిర్ణయం సరైందని నిరూపించుకున్నాడు. రాజస్థాన్ పేసర్లు నాండ్రే బర్గర్ (2/26), జోఫ్రా ఆర్చర్ (2/19) నిప్పులు చెరిగే బంతులతో చెన్నై టాప్ ఆర్డర్‌ను వణికించారు. దీంతో సీఎస్‌కే కేవలం 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తన పాత టీమ్‌పై సత్తా చాటుతాడనుకున్న సంజూ శామ్సన్.. చెన్నై తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లోనే కేవలం 6 పరుగులకే అవుటై నిరాశపరిచాడు.

ఒక దశలో 100 పరుగులు కూడా దాటడం కష్టమనిపించిన తరుణంలో, జేమీ ఓవర్టన్ (43 పరుగులు) అద్భుత ఇన్నింగ్స్ ఆడి చెన్నైని ఆదుకున్నాడు. గత సీజన్ వరకు సీఎస్‌కేలోనే ఉన్న వెటరన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 2 వికెట్లు తీసి తన పాత టీమ్ పతనాన్ని శాసించాడు. చివరికి చెన్నై జట్టు నిర్ణీత ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్ అయింది. రాజస్థాన్ బౌలర్ల ధాటికి చెన్నై బ్యాటర్లు కనీసం క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు.

128 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. తొలి ఓవర్‌లోనే కార్తీక్ శర్మ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన వైభవ్, ఆ తర్వాత చెన్నై బౌలర్లను ఉతికి ఆరేశాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు. వైభవ్ (17 బంతుల్లో 52 పరుగులు; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసానికి తోడుగా యశస్వి జైస్వాల్ (38) నిలకడగా ఆడటంతో రాజస్థాన్ కేవలం 12.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ తన రికార్డును మెరుగుపరుచుకుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన 32 మ్యాచ్‌ల్లో ఇద్దరూ తలో 16 సార్లు గెలిచి సమానంగా నిలిచారు. గతేడాది నుంచి చెన్నైపై రాజస్థాన్‌కు ఇది వరుసగా మూడో విజయం కావడం విశేషం. 2022 నుంచి ఇప్పటివరకు జరిగిన 7 మ్యాచ్‌ల్లో రాజస్థాన్ ఏకంగా 6 మ్యాచ్‌ల్లో గెలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

Tags:    

Similar News