LPG Price: వాణిజ్య సిలెండర్ల ధరలు పెరిగాయి.. వంటింటి గ్యాస్ రేటు మారలేదు!
LPG Price: వాణిజ్య గ్యాస్ సిలెండర్ల ధరలను చమురు కంపెనీలు పెంచాయి. మరోవైపు వంటింటి గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాని మార్పు లేదు.
LPG Price
LPG Price: కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభం అవుతూనే గ్యాస్ సిలెండర్ల ధరల మోత మోగింది. ఈరోజు నుంచి కమర్షియల్ గ్యాస్ సిలెండర్ల ధరలను పెంచుతూ చమురు కంపెనీలు ప్రకటన చేశాయి. ఒక్కో సిలెండర్ పై రూ.195.50 ధరను పెంచారు. దీంతో హైదరాబాద్ లో కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధర రూ.2105.50 లకు చేరుకుంది. ఇక ఈ ధరల పెరుగుదలతో ఢిల్లీలో రూ.2078.50లుగాను, చెన్నైలో అత్యధికంగా ను రు.2246.50లు గాను కమర్షియల్ ఎల్పీజీ ధరలు ఉన్నాయి.
పశ్చిమాసియాలో తీవ్రం అవుతున్న యుద్ధం కారణంగా.. ఎల్ఫీజీ సరఫరా కొరత, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ధరలు కమర్షియల్ సిలెండర్ల ధరల పెంపుదలకు కారణంగా చెబుతున్నారు. అయితే, డొమెస్టిక్ అంటే ఇంటి వాడకానికి ఇచ్చే సిలెండర్ ధరలో ఎలాంటి మార్పు రాకపోవడం సామాన్యులకు ఊరటగా చెప్పవచ్చు. చివరి సారిగా కమర్షియల్ సిలెండర్ ధరను మార్చి1 వ తేదీన రూ.114.50లు పెంచారు. అదేవిధంగా డొమెస్టిక్ సిలెండర్ ధరను మార్చి7న 60 రూపాయలు పెంచారు. మళ్ళీ ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధర పెరగడం ప్రజలపై భారం వేస్తుంది. నేరుగా కాకపోయినా.. చాలా వస్తువుల్ ధరలు దీనితో పెరిగే అవకాశం ఉంటుంది. రెస్టారెంట్ యాజమాన్యాల ఖర్చులు పెరుగుతాయి. దీంతో టీ, టిఫిన్స్, స్నాక్స్ వంటి వాటి ధరలు పెంచే అవకాశం ఉంది. అలాగే, ఇది పెళ్లిళ్ల సీజన్. క్యాటరింగ్ భోజనాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
మారని పెట్రోల్ డీజిల్ ధరలు..
మరోవైపు సరఫరాల్లో అంతరాయాలు ఉన్నప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు రాలేదు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ పై ఎక్సయిజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించింది. దీంతో ఇటీవలి విపత్కర పరిస్థితుల్లో నష్టాల్లో కూరుకుపోతున్న ఆయిల్ కంపెనీలకు కొంతవరకూ ఊరట లభించింది. దీంతో పెట్రోల్, డీజిల్ దారుల్లో ఎటువంటి మార్పు లేకుండా కొనసాగుతున్నాయి. పరిస్థితులు ఇదేవిధంగా కొనసాగితే, ప్రభుత్వం ఏదైనా ప్రత్యేకమైన వెసులుబాట్లు కల్పిస్తే తప్ప భవిష్యత్తులో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశమే ఎక్కువ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం ఆగినంత వరకూ ఎల్ఫీజీ, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ఆగే అవకాశం ఉండదని వారంటున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పాకిస్తాన్ లో పెట్రోల్ డీజిల్ కొరతతో స్మార్ట్ లాక్ డౌన్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. అక్కడ స్కూల్స్ కు సెలవలు ప్రకటించారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కల్పించారు.