March 31 Deadline : పన్ను ఆదా నుంచి ఆధార్ లింక్ వరకు.. ఈ రోజు తప్పకుండా చేయాల్సిన పనులివే
March 31 Deadline : 2025-26 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సందర్భంగా నేడు (మార్చి 31) పూర్తి చేయాల్సిన ఇన్‌కమ్ ట్యాక్స్, ఆధార్ లింక్, బ్యాంక్ నామినీ పనుల పూర్తి వివరాలు తెలుసుకుందాం.
March 31 Deadline
March 31 Deadline : క్యాలెండర్ తిరగేయకముందే మన జేబులకు సంబంధించిన లెక్కలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. నేడు మార్చి 31, అంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆఖరి రోజు. రేపటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) మొదలవుతుండటంతో, ఇవాళ పూర్తి చేయాల్సిన ఆర్థిక పనులు చాలానే ఉన్నాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి బ్యాంక్ అకౌంట్ల వరకు నేటితో గడువు ముగియనున్న కీలక అంశాల వివరాలు తెలుసుకుందాం.
ఆర్థిక పరంగా మార్చి 31వ తేదీ అత్యంత కీలకమైనది. పన్ను చెల్లింపుదారులు, బ్యాంక్ ఖాతాదారులు, ఇన్వెస్టర్లు తమ పెండింగ్ పనులను పూర్తి చేయడానికి నేడే చివరి అవకాశం. ఇవాళ మంగళవారం మహావీర్ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ, ప్రజల సౌకర్యార్థం ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసులు, ఎల్‌ఐసీ కార్యాలయాలను తెరిచే ఉంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రేపటి నుంచి నియమ నిబంధనలు మారిపోతాయని, నేటి లోపు పనులు ముగించుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ట్యాక్స్ సేవింగ్స్‌కు లాస్ట్ ఛాన్స్
మీరు పాత పన్ను విధానంలో ఉండి, సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందాలనుకుంటే నేటితో ఆ ఛాన్స్ ముగిసిపోతుంది. పీపీఎఫ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), ఎల్‌ఐసీ ప్రీమియంలు లేదా ELSS వంటి పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి ఈ రోజే ఆఖరి తేదీ. ఒకవేళ మీరు ఈ అకౌంట్లు కలిగి ఉండి, కనీస వార్షిక బ్యాలెన్స్ జమ చేయకపోతే.. ఆ ఖాతాలు ఇనాక్టివ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే ఆ ఖాతాల్లో కనీస మొత్తాన్ని జమ చేయడం మర్చిపోకండి.
ఆధార్-పాన్, నామినీ అప్‌డేట్స్
ఆధార్ కార్డుతో పాన్ కార్డును అనుసంధానించడానికి లేదా కొత్త పాన్ అప్లై చేసేటప్పుడు ఆధార్‌ను జత చేయడానికి నేడే ఆఖరి గడువు. ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తు ప్రక్రియ మరింత కఠినతరం కానుంది, అప్పుడు అదనపు డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు, సెబీ నిబంధనల ప్రకారం బ్యాంక్ ఖాతాలు, డీమ్యాట్ అకౌంట్లకు నామినీ పేరును పొందుపర్చాలి. ఒకవేళ నామినీ వివరాలు ఇవ్వకపోతే మీ అకౌంట్లు ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
ఐటీ రిటర్నులు.. స్టాక్ మార్కెట్ వ్యూహాలు
2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏవైనా అప్‌డేటెడ్ రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటే, నేటి అర్థరాత్రి లోపు ఆ పని పూర్తి చేయాలి. బడ్జెట్ 2025లో ఇచ్చిన నాలుగేళ్ల పొడిగింపు గడువు నేటితో ముగుస్తుంది. అలాగే, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసే వారు తమ నష్టాలను లాభాలతో సర్దుబాటు చేసుకుని క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తగ్గించుకోవడానికి నేడే ఆఖరి ట్రేడింగ్ డే. విదేశీ ఆదాయంపై పన్ను మినహాయింపు కోరేవారు ఫారం 67 దాఖలు చేయడం మర్చిపోవద్దు.
ఉద్యోగులు జాగ్రత్త
ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగ ఉద్యోగులు తమ ఇన్వెస్ట్‌మెంట్ ప్రూఫ్‌లను ఆఫీసులో సమర్పించకపోతే, గత నెల కంటే ఈ నెల జీతంలో టీడీఎస్ రూపంలో ఎక్కువ డబ్బు కట్ అవుతుంది. కాబట్టి మీ ఇన్వెస్ట్‌మెంట్ డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మార్చి 31 దాటితే ఏ చిన్న పనికైనా పెనాల్టీలు పడే అవకాశం ఉందని మదుపర్లు గమనించాలి.