Bitcoin: క్రిప్టో మార్కెట్‌లో భూకంపం...కుప్పకూలిన బిట్‌కాయిన్ ధర
Bitcoin: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బిట్‌కాయిన్ ధర భారీగా పడిపోతోంది.
Bitcoin: క్రిప్టో మార్కెట్‌లో భూకంపం...కుప్పకూలిన బిట్‌కాయిన్ ధర
Crypto Market : డిజిటల్ బంగారం అని పిలుచుకునే బిట్‌కాయిన్ ఇప్పుడు ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. గత కొద్దిరోజులుగా ఊగిసలాటలో ఉన్న బిట్‌కాయిన్ ధర.. ఇప్పుడు కీలకమైన సపోర్ట్ లెవల్ వద్ద నిలబడింది. అసలు బిట్‌కాయిన్ ఎందుకు పడిపోతోంది? ఇది మళ్ళీ పుంజుకుంటుందా లేక 60 వేల డాలర్ల దిగువకు పడిపోనుందా? అనే అనుమానం కలుగుతుంది.
మార్కెట్ పరిస్థితి ఏమిటి?
ప్రస్తుతం అంతర్జాతీయ క్రిప్టో మార్కెట్ అంతా రెడ్ మార్క్‌లోనే కనిపిస్తోంది. బిట్‌కాయిన్ ధర 65,900 నుంచి 66,500 డాలర్ల మధ్య ఊగిసలాడుతోంది. గత వారంలోనే దాదాపు 4 శాతం మేర నష్టపోయిన బిట్‌కాయిన్, మార్చి 27న 65,720 డాలర్ల కనిష్ట స్థాయిని తాకింది. కేవలం బిట్‌కాయిన్ మాత్రమే కాదు.. ఎథరియం, సొలానా వంటి టాప్ కరెన్సీలు కూడా 3 నుంచి 5 శాతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
పతనానికి 3 ప్రధాన కారణాలు
మధ్య ప్రాచ్య దేశాల్లో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల వల్ల ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. రిస్క్ ఎక్కువగా ఉండే క్రిప్టోలను వదిలేసి, సురక్షితమైన బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.మార్చి 27తో దాదాపు 14 బిలియన్ డాలర్ల విలువైన ఆప్షన్స్ గడువు ముగిసింది. ఇంత భారీ స్థాయిలో ట్రేడర్లు తమ పొజిషన్లను క్లోజ్ చేయడంతో మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి విపరీతంగా పెరిగింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చనే సంకేతాలు రావడంతో, ఇన్వెస్టర్లు క్రిప్టో మార్కెట్ నుంచి వెనక్కి తగ్గుతున్నారు.
ముందున్నది ముసళ్ళ పండగా?
ఇప్పుడు అందరి కళ్లు 66,000 డాలర్ల మార్కుపైనే ఉన్నాయి. ఒకవేళ బిట్‌కాయిన్ ఇక్కడ నిలదొక్కుకుంటే, తిరిగి 68,000 నుంచి 70,000 డాలర్ల క్లబ్‌లోకి చేరవచ్చు.ఒకవేళ ఈ సపోర్ట్ లెవల్ బ్రేక్ అయితే మాత్రం.. ధర నేరుగా 60,000 డాలర్ల వరకు పడిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ చర్చల ఫలితాలు, చమురు ధరలు , అమెరికా ఫెడ్ నిర్ణయాలే రాబోయే రోజుల్లో క్రిప్టో భవితవ్యాన్ని తేల్చనున్నాయి. క్రిప్టోలో పెట్టుబడి పెట్టేవారు ప్రస్తుతానికి ఆచి తూచి అడుగు వేయడం మంచిది.