Petrol Price: ప్రభుత్వ నిర్ణయంతో నిజంగా పెట్రోల్ రేట్లు తగ్గుతాయా? తెలుసుకోండి

Petrol Price: ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివలన నిజంగా పెట్రోల్ ధరలు తగ్గుతాయా? తెలుసుకుందాం

Update: 2026-03-27 05:49 GMT

Petrol Price

Petrol Price: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.10 తగ్గించింది. పీటీఐ వార్తా సంస్థ కథనం ప్రకారం, పెట్రోల్‌పై సుంకాన్ని లీటరుకు రూ.13 నుంచి రూ.3కు తగ్గించారు. డీజిల్‌పై సుంకాన్ని పూర్తిగా తొలగించారు. లేదా సున్నాకు తగ్గించారు. ఇప్పుడు ఈ వార్త విన్నవెంటనే అందరూ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిపోతాయని సంతోషపడుతున్నారు. కానీ, వాస్తవానికి ఈ తగ్గింపు వాళ్ళ నేరుగా వినియోగదారుని వచ్చే మేలు ఏమీ ఉండదు. ఎందుకో తెలియాలంటే అసలు ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ ఎందుకు తగ్గించింది అర్ధం చేసుకోవాలి

పెరిగిపోయిన క్రూడాయిల్ ధరలు..

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కారణంగా, ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 70 డాలర్ల నుండి 100 డాలర్లకు పైగా పెరిగాయి. దీనివల్ల చమురు కంపెనీలు నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ నష్టాలను తగ్గించుకోవడానికి, కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. దీనివల్ల సామాన్యుడిపై భారం మరింత పెరుగుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే అది ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. అందుకే కేంద్రం జాగ్రత్తగా అడుగులు వేసింది. పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచడానికి ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.

మరి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ లేదా?

దీనికి సమాధానం లేదనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే, ప్రభుత్వం పన్నులు తగ్గించినప్పటికీ, పెట్రోల్, డీజిల్ చిల్లర ధరలను ప్రభుత్వం నేరుగా నిర్ణయించదు. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి చమురు కంపెనీలు ముడి చమురు ధరలు..తమ సొంత లాభాల ఆధారంగా ధరలను నిర్ణయిస్తాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన రాయితీలను ఈ కంపెనీలు తమ నష్టాలను పూడ్చుకోవడం కోసం ఉపయోగించుకుంటాయి. నిపుణులు వేస్తున్న అంచనా ఇదే. ఒకవేళ ఆ కంపెనీలు తమ నష్టాలను భరించాలని అనుకుంటే పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. కానీ, ఏ కంపెనీ తాను నష్టపోయి.. ప్రజలకు మేలు చేయాలనీ అనుకుంటుంది?

ఇక్కడ ఇంకో విషయం అర్ధం చేసుకోవాలి.. కొన్ని వారాలుగా పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా, చమురు కంపెనీలు అధిక ధరలకు ముడి చమురును కొనుగోలు చేస్తున్నప్పటికీ, దేశీయ మార్కెట్లో ధరలను పెంచలేదు. కంపెనీలు ఇప్పుడు ఈ పన్ను తగ్గింపును ఆ నష్టాలను పూడ్చుకోవడానిక , తమ లాభాలను స్థిరీకరించుకోవడానికి ఉపయోగించుకుంటాయి. జాతీయ మీడియా రిపోర్ట్స్ ప్రకారం, చమురు కంపెనీలు ప్రస్తుతం పెట్రోల్‌పై లీటరుకు ₹24, డీజిల్‌పై లీటరుకు ₹30 నష్టాలను చవిచూస్తున్నాయి. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఈ రాయితీ కూడా చమురు కంపెనీలకు వచ్చే నష్టాన్ని పూర్తిగా పూడ్చలేదనేది అర్ధం అవుతుంది.

అయితే, భవిష్యత్ లో పెరిగే అవకాశం ఉందా?

ఇది పూర్తిగా అంతర్జాతీయ మార్కెట్‌పై ఆధారపడి ఉంటుంది. బ్రెంట్ క్రూడ్ ప్రస్తుతం బ్యారెల్‌కు $100 కంటే ఎక్కువ ధరకు ట్రేడ్ అవుతోంది. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరిగి, సరఫరా గొలుసులకు అంతరాయం ఏర్పడితే, ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో, ధరలు మరీ ఎక్కువగా పెరగకుండా నిరోధించడానికి ఎక్సైజ్ సుంకం తగ్గింపు కేవలం ఒక పాక్షిక రక్షణ కవచంలా మాత్రమే పనిచేస్తుంది. కానీ, శాశ్వతంగా పెట్రోల్ ధరలు పెరగకుండా కాపాడలేదు.

దీనివలన ప్రభుత్వానికి నష్టం..

ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది. పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెబుతున్న దాని ప్రకారం, అంతర్జాతీయ సంక్షోభం పూర్తి ప్రభావం భారతీయ వినియోగదారులపై పడకుండా, ద్రవ్యోల్బణం నుండి వారిని రక్షించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నష్టపోయినా.. సామాన్యులు ఇబ్బంది పడకూడదనేదే తమ లక్ష్యం అని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో..

సాధారణంగా, కేంద్ర ప్రభుత్వం సుంకాలను తగ్గించిన తర్వాత, వ్యాట్‌ను తగ్గించమని రాష్ట్రాలపై ఒత్తిడి పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ పన్ను వాటాను (వ్యాట్) తగ్గిస్తేనే, వినియోగదారులు పెట్రోల్ బంకు వద్ద ₹2 నుండి ₹5 వరకు నిజమైన ఉపశమనాన్ని పొందగలుగుతారు. ఇప్పుడు రాష్ట్రాలు ఆ పని చేస్తాయని అనుకోవడానికి వీలు లేదు.

మొత్తమ్మీద చూస్తే ప్రభుత్వం పెట్రోల్ ధరలను స్థిరంగా ఉంచేలా చూడటం కోసమే కంపెనీలకు రాయితీలు ఇచ్చింది. ప్రపంచ పరిస్థితులతో చూస్తే భారత్ లో పెట్రోల్ సంక్షోభం అంతగా లేదనే చెప్పాలి. ఈ పరిస్థితుల్లో పెట్రోల్ ధరలు పెరగకుండా ఉండటమే సామాన్యులకు, దేశ ఆర్థిక స్థితికి పెద్ద ఊరటగా భావించాలని నిపుణులు అంటున్నారు.

Tags:    

Similar News