Gold Rate Today: గుడ్ న్యూస్..మళ్లీ తగ్గిన బంగారం ధరలు..నిలకడగా వెండి

Gold Rate Today: వరుసగా పెరుగుతూ సామాన్యులను బెంబేలెత్తించిన బంగారం ధరలు ఇప్పుడు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. ఈరోజు కూడా బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది.

Update: 2026-03-25 01:26 GMT

Gold Rate Today

Gold Rate Today: పెళ్లిళ్ల సీజన్ జోరుగా నడుస్తోంది. బంగారానికి దేశీయంగా డిమాండ్ పెరుగుతోంది. అయినా, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు కింది చూపులు చూస్తూనే ఉన్నాయి. వరుసగా భారీగా పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపించి.. బంగారం అంటేనే బాబోయ్ అనే పరిస్థితికి వెళ్లిన పసిడి క్రమేపీ అందుబాటు ధరల్లోకి వస్తోంది. వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు అంటే మార్చి 25 న మరికాస్త దిగొచ్చాయి.

ఈరోజు ధరలు ఇలా..

హైదరాబాద్ లో ఈరోజు బంగారం 24 క్యారెట్లు 10 గ్రాములకు 380 రూపాయల తగ్గుదల నమోదు చేసి 1,42,910 రూపాయలకు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్లు 10 గ్రాములకు 350 రూపాయలు తగ్గి 1,31,000 రూపాయల వద్ద ఉంది. నిజానికి నిన్న అంటే మంగళవారం మార్కెట్లు ప్రారంభం అయిన వెంటనే బంగారం ధరలు జంప్ అయ్యాయి. కానీ, ఆ తరువాత తగ్గుతూ వచ్చి మార్కెట్ ముగిసే సమయానికి కాస్త తగ్గుదలను నమోదు చేశాయి.

మరోవైపు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు దాదాపుగా ఒకేలా ఉన్నాయి. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,42,910 వద్ద, 22 క్యారెట్ల బంగారం రూ.1,31,000 వద్ద ఉన్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల ధర రూ.1,43,060 గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,31,150 వద్ద ఉంది. చెన్నైలో కూడా హైదరాబాద్ కంటే ఎక్కువగానే ధరలు ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల ధర రూ.1,44,560 గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,32,500 వద్ద ఉంది. అలాగే బెంగళూరు విషయానికి వస్తే అక్కడ బంగారం ధరలు హైదరాబాద్ లో లానే ఉన్నాయి.

వెండి ధరలు ఇలా..

బంగారం ధరలు తగ్గుతుంటే, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్ తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు మార్పులు లేకుండా నిలిచాయి. హైదరాబాద్ లో కేజీ వెండి ధర 2,50,000 రూపాయలు ఉండగా.. ఢిల్లీలో 2,35,000 రూపాయలుగా ఉంది.

అంతర్జాతీయంగా..

అంతర్జాతీయంగా ఈరోజు అంటే 25 మార్చి న బంగారం, వెండి ధరలు పెరుగుదల నమోదు చేశాయి. దాదాపు 9రోజుల పాటు తగ్గుతూ వచ్చిన ధరలు ఈరోజు పెరగడం విశేషం. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో బంగారం ధరలు ఔన్స్ కు 17 డాలర్లు పెరిగి 4,423 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇక వెండి కూడా ఒక్క శాతం పెరుగుదల కనబర్చింది. ఔన్స్ కు 69.86 డాలర్లకు చేరుకుంది. ఇరాన్ పై దాడులను నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఇన్వెస్టర్స్ బంగారం, వెండి కొనుగోళ్ల వైపు కదిలినట్టు కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. అందుకే బంగారం ధరలు పెరుగుదల చూపించాయని వారు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు పెరిగిన నేపథ్యంలో ఈరోజు దేశీయంగానూ ఆ ప్రభావం ఉండవచ్చని, మార్కెట్లు తెరిచే సమయానికి ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ఇక్కడ ఇచ్చిన బంగారం ధరలు ఈరోజు అంటే 25.03.2026 ఉదయం 6 గంటల సమయానికి ఉన్నవి. సాధారణంగా బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూ ఉంటాయి. మార్కెట్ తెరిచే సమయానికి అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక డిమాండ్ ఆధారంగా ధరల్లో మార్పులు రావచ్చు. బంగారం, వెండి కొనాలనుకునే ముందు స్థానికంగా వివిధ విక్రేతల వద్ద ధరలను సరిపోల్చుకోవలసినదిగా సూచిస్తున్నాం.

Tags:    

Similar News