LPG Cylinder: గ్యాస్ సిలెండర్ బరువు 10 కేజీలకు తగ్గిస్తారనే వార్త అబద్ధం.. కేంద్రం క్లారిటీ
LPG Cylinder: వంట గ్యాస్ సిలెండర్ బరువును 14 నుంచి 10 కేజీలకు తగ్గించనున్నారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేసింది.
LPG Cylinder
LPG Cylinder: దేశంలో ఎల్పీజీ సిలిండర్ల బరువును 14.2 కేజీల నుంచి 10 కేజీలకు తగ్గించబోతున్నారన్న వార్తలను కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఖండించింది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ, అటువంటి వార్తలు కేవలం వదంతులు మాత్రమేనని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
హోర్ముజ్ జలసంధిలోని ప్రస్తుత పరిస్థితి కారణంగా ఎల్‌పిజి దిగుమతులకు అంతరాయం ఏర్పడిందని, దీనిని అధిగమించడానికి చమురు కంపెనీలు సిలిండర్‌లోని గ్యాస్ పరిమాణాన్ని తగ్గించాలని యోచిస్తున్నాయని వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ స్పందన వచ్చింది. అయితే, ప్రభుత్వం గానీ, చమురు కంపెనీలు గానీ అటువంటి చర్య ఏదీ తీసుకోలేదని మంత్రిత్వ శాఖ అధికారికంగా పేర్కొంది.
వదంతులు నమ్మొద్దు..
సరఫరా సంక్షోభాన్ని పరిష్కరించడానికి 10 కేజీల సిలిండర్లను పంపిణీ చేస్తారనే వదంతి సోషల్ మీడియాలో వ్యాపించింది. ఇది పూర్తిగా తప్పుడు సమాచారం. అటువంటి నకిలీ వార్తలను ఎవరూ నమ్మవద్దని సుజాత శర్మ అన్నారు. దేశంలో ఎల్పీజీ నిల్వలు సురక్షితంగా ఉన్నాయని, సరఫరాకు ఎలాంటి అంతరాయం ఉండదని మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది.
అనవసరమైన భయాందోళనలను నివారించడానికి, అధికారిక వర్గాల నుండి వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని అధికారులు వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు.
వదంతులు ఇవీ..
గ్యాస్ సిలెండర్ లో గ్యాస్ ను తగ్గించేందుకు కంపెనీలను కేంద్రం ఆదేశించిందని సోమవారం నుంచి వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పుడు ఇస్తున్న 14.2 కేజీల వంట గ్యాస్ కు బదులుగా 10 కేజీలు మాత్రమే ఇకపై సిలెండర్ లో ఉంటుందని ఆ వార్తా కథనాలు వెల్లడించాయి. ఈ వార్తలు వచ్చిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో దీనిపై విపరీతంగా ప్రచారం మొదలైంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇవి నిజమే కావచ్చని ప్రజలు కూడా నమ్మారు. ఈ ప్రచారం జోరుతో కేంద్రం అప్రమత్తమైంది. ఈ విషయమై క్లారిటీ ఇచ్చింది. వంట గ్యాస్ బరువు తగ్గించే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేసింది.