Dollar vs Rupee: మరింత పడిపోయిన రూపాయి..అత్యల్ప కనిష్ట స్థాయికి చేరిక!

Dollar vs Rupee: డాలరుతో రూపాయి విలువ వేగంగా పడిపోతోంది. మధ్యప్రాచ్యంలో యుద్ధం రూపాయి విలువను క్షీణించేలా చేస్తున్నాయి. రికార్డు కనిష్ట స్థాయికి రూపాయి విలువ పడిపోయింది.

Update: 2026-03-23 11:20 GMT

Dollar vs Rupee

Dollar vs Rupee: మధ్య ప్రాచ్యంలో పరిస్థితుల నేపథ్యంలో డాలరుతో రూపాయి విలువ క్షీణిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అత్యంత కనిష్ట స్థాయికి ఈరోజు (మార్చి 23) రూపాయి విలువ పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 94 మార్కు కంటే దిగువకు పడిపోయింది. చరిత్రలో రూపాయి ఈ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి. ఈరోజు ఉదయం విదేశీ మారక మార్కెట్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి 93.83 వద్ద ప్రారంభమైంది. తదుపరి ట్రేడింగ్‌లో ఇది 94 మార్కును దాటింది.

రూపాయి విలువ తగ్గడానికి గల కారణాలు ఏమిటి?

నిరంతరం అధికంగా ఉన్న ముడి చమురు ధరలు భారతదేశ దిగుమతి వ్యయాలను గణనీయంగా పెంచాయి. దిగుమతులు పెరిగినప్పుడు, డాలర్లకు డిమాండ్ పెరుగుతుంది. ఫలితంగా, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ సహజంగానే తగ్గుతుంది.

రూపాయి విలువ క్షీణించడానికి అమెరికా డాలర్ బలపడటమే కాకుండా, ఇతర కారణాలు కూడా ఉన్నాయి. భారత మార్కెట్ల నుండి విదేశీ డబ్బు నిరంతరం బయటకు తరలిపోతోంది. అంటే, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మన స్టాక్ మార్కెట్ నుంచి వెళ్లిపోతున్నారు. అదేవిధంగా, బాండ్ల రాబడులు కూడా అధిక స్థాయిలో ఉన్నాయి. ఈ కారకాలు రూపాయిపై ఒత్తిడి తెచ్చాయని నిపుణులు భావిస్తున్నారు.

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు) భారత మార్కెట్‌లో తాము పెట్టుబడి పెట్టిన స్టాక్‌లు, బాండ్‌లు మొదలైనవాటిని ఎక్కువగా అమ్ముతున్నారు. వారు అమ్మేటప్పుడు, రూపాయిని డాలర్లుగా మార్చుకుంటారు. దీనివల్ల, అమెరికన్ డాలర్‌కు డిమాండ్ పెరిగి, రూపాయి విలువ పడిపోతుంది.

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నప్పుడు పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉంటారు. అటువంటి పరిస్థితులలో, వారు రూపాయి వంటి కరెన్సీలకు బదులుగా డాలర్‌ను కలిగి ఉండటానికి మొగ్గు చూపుతారు. ఇది డాలర్‌కు డిమాండ్‌ను మరింత పెంచుతుంది.

మొత్తంమీద ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి పతనం వేగం చూస్తుంటే, త్వరలోనే అది డాలరుతో మారకం విలువ 100కి చేరుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

రూపాయి విలువ పడిపోతే ఏమి జరుగుతుంది..

రూపాయి విలువ తగ్గిపోతే దిగుమతి అయ్యే ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. ఇప్పటికే ముడిచమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రూపాయి విలువ తగ్గడంతో ఆ ప్రభావం మరింత ఎక్కువగా భారత్ పై ఉంటుంది. అంటే డాలరుతో రూపాయి మారకం విలువ 10 గా ఉందనుకుందాం. అప్పుడు ఉదాహరణకు 100 డాలర్ల విలువ చేసే క్రూడాయిల్ మన కరెన్సీలో 1000 రూపాయలుగా ఉంటుంది. అదే ఇప్పుడున్న రూపాయి మారకం విలువతో లెక్కిస్తే 9300 రూపాయలు అవుతుంది. ఇలా దిగుమతి చేసుకునే ప్రతి వస్తువుకు మనం ఎక్కువ రూపాయలు పెట్టాల్సి వస్తుంది. ఇది మన దేశంలో ధరలను ప్రభావితం చేస్తుంది. ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది.

రూపాయి విలువ తగ్గడం వలన దేశంలో ఎగుమతి దారులకు మేలు చేస్తుంది. వారు ఎగుమతి చేసే ప్రతి వస్తువుకు డాలర్లలో డబ్బు అందుకుంటారు. అందువల్ల వారికి లాభం కలుగుతుంది.

Tags:    

Similar News