Gold & Silver Prices Crash: యుద్ధం ముదురుతున్నా పడిపోతున్న పసిడి & వెండి ధరలు.. కారణాలు ఇవే!

Gold & Silver Prices Crash: యుద్ధం జరుగుతున్నా బంగారం, వెండి ధరలు ఎందుకు పడిపోతున్నాయి? కేవలం వారం రోజుల్లోనే వేలల్లో తగ్గిన ధరల వెనుక ఉన్న అసలు కారణాలేంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చదవండి.

Update: 2026-03-22 13:22 GMT

Gold & Silver Prices Crash: యుద్ధం ముదురుతున్నా పడిపోతున్న పసిడి & వెండి ధరలు.. కారణాలు ఇవే! 

Gold & Silver Prices Crash: సాధారణంగా అంతర్జాతీయ ఉద్రిక్తతలు లేదా యుద్ధం వంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి. కానీ, ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, భారత్‌లో పసిడి, వెండి ధరలు అనూహ్యంగా పడిపోతుండటం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా వెండి ధరలు గరిష్ట స్థాయిల నుంచి భారీగా క్రష్ అయ్యాయి. ఈ ఏడాది జనవరి 29న కిలో వెండి ధర రికార్డు స్థాయిలో రూ.4,20,048 వద్ద ఆల్-టైమ్ హైని తాకగా, ప్రస్తుతం ఆ స్థాయి నుంచి ఏకంగా రూ.1,92,578 వరకు తగ్గడం గమనార్హం. కేవలం వెండి మాత్రమే కాకుండా బంగారం కూడా గత వారం రోజులుగా జోరు చూపించడం లేదు. ఎంసీఎక్స్ (MCX) మార్కెట్‌లో మార్చి 13న 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,466 ఉండగా, శుక్రవారం నాటికి అది రూ.13,641 మేర క్షీణించి రూ.1,44,825 వద్ద ముగిసింది. జీవితకాల గరిష్టమైన రూ.1,93,096తో పోలిస్తే ప్రస్తుతం తులం బంగారం సుమారు రూ.48,271 తక్కువకే లభిస్తోందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

దేశీయ మార్కెట్‌లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ లెక్కల ప్రకారం, వారం వ్యవధిలోనే 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,58,399 నుంచి రూ.1,47,218 కి పడిపోయింది. అంటే తులంపై ఏకంగా రూ.9,181 మేర తగ్గి కొనుగోలుదారులకు భారీ ఉపశమనాన్ని ఇచ్చింది. ప్రస్తుతం మార్కెట్‌లో వివిధ క్వాలిటీల ధరలను పరిశీలిస్తే, 22 క్యారెట్ల బంగారం రూ.1,43,690, 18 క్యారెట్ల బంగారం రూ.1,19,250 వద్ద కొనసాగుతున్నాయి. వెండి కిలోకు రూ.28,124 మేర తగ్గి రూ.2,32,364 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ధరల్లో జీఎస్టీ (GST), మేకింగ్ ఛార్జీలు కలవలేదు. ఫైనల్ ధరలు వీటికి అదనంగా 3 శాతం జీఎస్టీ, ఆయా రాష్ట్రాల్లో ఉండే మేకింగ్ ఛార్జీలను బట్టి మారుతుంటాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.

ఇక అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పటికీ ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వడ్డీ రేట్లలో మార్పు లేకపోవడం వల్ల బంగారంపై కొనుగోలు ఒత్తిడి తగ్గిందన్నారు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికన్ డాలర్ బలోపేతం కావడం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళనలు కూడా బంగారం, వెండి ధరల పతనానికి కారణమవుతున్నాయని అవుతున్నాయన్నారు. హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పెరగడం వంటి భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఉన్నప్పటికీ, డాలర్ ఇండెక్స్ బలంగా ఉండటం బంగారం పతనం కావడంలో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.

Tags:    

Similar News