HDFC Bank:హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కు షాక్.. రెండు రోజుల్లో లక్ష కోట్లకు పైగా లాస్!

HDFC Bank:హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఛైర్మన్ అటాను చక్రవర్తి ఆకస్మిక రాజీనామాతో రెండు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.1 లక్ష కోట్లు ఆవిరైంది. కేవలం రెండు రోజుల్లోనే షేరు విలువ 7.5% పడిపోయింది.

Update: 2026-03-20 11:54 GMT

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కు షాక్.. రెండు రోజుల్లో లక్ష కోట్లకు పైగా లాస్!

HDFC Bank: దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్‌డిఎఫ్‌సి (HDFC) బ్యాంక్ వరుస పతనాలతో ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది. బ్యాంకు ఛైర్మన్ అటాను చక్రవర్తి అనూహ్య రాజీనామా ప్రభావం స్టాక్ మార్కెట్‌పై తీవ్రంగా పడింది. గురువారం 5 శాతం పడిపోయిన బ్యాంక్ షేరు, శుక్రవారం మరో 2 శాతం క్షీణించి రూ.781 వద్ద కనిష్ట స్థాయిని తాకింది.

రూ. లక్ష కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి..

కేవలం రెండు ట్రేడింగ్ సెషన్లలోనే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేరు విలువ సుమారు 7.5 శాతం మేర పడిపోయింది. గురువారం నాటి భారీ పతనంతోనే ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.1 లక్ష కోట్లు ఆవిరి కాగా, శుక్రవారం నాటి అమ్మకాల ఒత్తిడితో మార్కెట్ క్యాపిటలైజేషన్ మరింత క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ (ADR) విలువ తగ్గడం కూడా దేశీయ షేర్లపై ఒత్తిడి పెంచింది.

అసలు కారణం ఏంటి..

గత రెండేళ్లుగా బ్యాంకులో జరుగుతున్న కొన్ని పద్ధతులు, నిర్ణయాలు తన వ్యక్తిగత విలువలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ అటాను చక్రవర్తి తన ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. దీనికి సంబంధించి బ్యాంకు ఎండి & సీఈఓ శశిధర్ జగదీషన్ మాట్లాడుతూ.. చక్రవర్తి తన నిర్ణయాన్ని మార్చుకోవాలని బోర్డు సభ్యులందరూ కోరినప్పటికీ ఆయన నిరాకరించారని తెలిపారు. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు బ్యాంక్ వేగంగా స్పందించింది. ఆర్‌బిఐ (RBI) అనుమతితో మాజీ హెచ్‌డిఎఫ్‌సి సీఈఓ కీకీ మిస్త్రీని తాత్కాలిక పార్ట్‌టైమ్ ఛైర్మన్‌గా నియమించింది.

మార్కెట్ తీవ్రంగా స్పందించినప్పటికీ, విశ్లేషకులు దీనిని ఒక సమస్యగా చూడటం లేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ పతనం వల్ల స్టాక్ విలువ బాగా తగ్గింది (Deep Value), ఇది దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు మంచి అవకాశం కావచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇది కేవలం పని పద్ధతుల్లో భేదాల వల్ల వచ్చిన సమస్యే తప్ప, నిబంధనల ఉల్లంఘన కాదని స్పష్టం చేశారు. బ్యాంకు వ్యవస్థలు పటిష్టంగా ఉన్నాయని, ధర తగ్గినప్పుడు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయమని సూచించారు. మొత్తానికి, ఛైర్మన్ మార్పు నేపథ్యంలో ఏర్పడిన ఈ అనిశ్చితిని బ్యాంక్ కొత్త నాయకత్వంతో ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలని అన్నారు.

Tags:    

Similar News