India Post: 24 గంటల్లో పార్సిల్ డెలివరీ లేదా పూర్తి వాపసు.. తపాలాశాఖ గ్యారెంటీ!
India Post: ఇండియా పోస్ట్ 24 గంటల డెలివరీ సర్వీస్ ప్రారంభించింది. హైదరాబాద్ సహా 6 నగరాల్లో మనీ-బ్యాక్ గ్యారెంటీతో వేగవంతమైన పార్శిల్ సర్వీసులు అందుబాటులోకి..
India Post
India Post: ఏదైనా పార్సిల్ లేదా డాక్యుమెంట్ పంపించాలంటే పోస్టల్ సర్వీస్ ద్వారా పంపించాలంటే చాలా ఆలస్యం అవుతుందనేది చాలామంది భావన. అయితే, ఇది గతం. కాలంతో పాటు పోస్టల్ సర్వీసులు కూడా మారుతూ వస్తున్నాయి. వేగవంతమైన ప్రపంచంతో పోటీపడుతున్నాయి. ఎప్పటికప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ లో కొత్తదనాన్ని తీసుకు వస్తున్నారు. భారతదేశపు అత్యంత నమ్మకమైన పోస్టల్ వ్యవస్థను ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఇండియా పోస్ట్ ద్వారా 24 గంటల్లోపు ముఖ్యమైన పత్రాలు లేదా పార్శిళ్లను పంపించే అవకాశం వచ్చింది. భారత తపాలా శాఖ మంగళవారం, (మార్చి 17న) మూడు కొత్త ప్రీమియం సర్వీసులను ప్రారంభించింది. ఈ సర్వీసులతో ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి గ్యారెంటీ వస్తుంది. మనం పార్సిల్ బుక్ చేసుకున్నప్పుడు మనకు చెప్పిన సమయంలోపు అది డెలివరీ కాకపోతే కనుక “మనీ-బ్యాక్ గ్యారెంటీ" కింద మనకు పూర్తి వాపసు లభిస్తుంది.
కొత్తగా వచ్చిన సర్వీసులు ఇవే..
- 24 గంటల స్పీడ్ పోస్ట్: దీని ద్వారా, మన ముఖ్యమైన డాక్యుమెంట్స్ బుకింగ్ చేసిన మరుసటి రోజే అవతలి వారికి చేరిపోతాయి.
- 24 గంటల స్పీడ్ పోస్ట్ పార్సెల్: ఇది బరువైన వస్తువులు లేదా బాక్స్ ల కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ. మన పార్సిల్ కచ్చితంగా 24 గంటలలోపు డెలివరీ చేస్తామని పోస్టల్ శాఖ హామీ ఇస్తోంది.
- 48 స్పీడ్ పోస్ట్: మీ పార్సెల్ చేరడానికి 2 రోజులు (48 గంటలు) పడుతుంది. మొదటి రెండింటితో పోలిస్తే ఈ సర్వీస్ కాస్త ఖర్చు తక్కువ కావచ్చు.
ఢిల్లీ, ముంబై సహా 6 నగరాల్లో..
తపాలా శాఖ ప్రస్తుతం దేశంలోని ఆరు ప్రధాన మెట్రో నగరాల్లో ఈ సర్వీసులు స్టార్ట్ చేసింది. వీటిలో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ ఉన్నాయి.
ఈ నగరాల్లో డెలివరీ గడువును పాటించేందుకు, సంబంధిత శాఖ ప్రత్యేక ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసింది. విమానాల ద్వారా పార్శిళ్లను పంపడానికి ఏర్పాట్లు చేశారు.
ఓటీపీ తప్పనిసరి..
తపాలా శాఖ సేఫ్టీ, టెక్నాలజీ విషయాల్లోనూ మెరుగైన పద్ధతులు ప్రవేశపెట్టింది.
- OTP ఆధారిత డెలివరీ: ఇకపై, పోస్టల్ ద్వారా ఏదైనా పార్సిల్ లాంటిది రిసీవ్ చేసుకోవాలంటే ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది. ఓటీపీ సరైనది అయితేనే, పోస్ట్ మ్యాన్ పారిస్ డెలివరీ ఇస్తాడు.
- రియల్-టైమ్ ట్రాకింగ్: మనం బుక్ చేసిన పార్సెల్ ప్రస్తుతం ఎక్కడ ఉందో మన మొబైల్ ద్వారా లైవ్ ట్రాక్ చేయవచ్చు. బుకింగ్ నుండి డెలివరీ వరకు ప్రతి దశలోనూ బుక్ చేసిన వారికి SMS అప్‌డేట్‌లు అందుతాయి.
- ఫ్రీ పికప్: మీరు ఒకేసారి ఎక్కువ పార్శిళ్లను పంపాలనుకుంటే (బల్క్ బుకింగ్), పోస్టల్ శాఖ మీ ఇల్లు లేదా కార్యాలయం నుంచి పార్శిల్స్ ను ఉచితంగా తీసుకువెళుతుంది.
- BNPL సౌకర్యం: కార్పొరేట్, వ్యాపార వినియోగదారుల కోసం ఇప్పుడే కొనండి, తర్వాత చెల్లించండి (Buy Now Pay Later) సౌకర్యం కూడా అందిస్తోంది పోస్టల్ శాఖ.
లక్షల కోట్ల ఈ - కామర్స్ మార్కెట్..
పోస్టల్ శాఖ తీసుకువచ్చిన కొత్త పథకాలను ఢిల్లీలోని ఆల్ ఇండియా రేడియో భవన్ జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ఇండియా పోస్ట్‌కు ఒక అద్భుతమైన మార్పులకు నాంది అని చెప్పారు. భారతదేశ ఈ-కామర్స్ మార్కెట్ ప్రస్తుతం సుమారు ₹11 లక్షల కోట్ల విలువైనదని, ఇది 2030 నాటికి మూడు రెట్లు పెరిగి ₹30 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఆయన వివరించారు. ఈ అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లో తన వాటాను బలోపేతం చేసుకోవాలని తపాలా శాఖ చూస్తోంది. ఆధునిక పోటీకి తపాలా శాఖ ఇప్పుడు సిద్ధంగా ఉందని సింధియా అన్నారు.
మొత్తమ్మీద భారత పోస్టల్ డిపార్ట్మెంట్ తీసుకువచ్చిన ఈ విధానాలు ప్రయివేట్ ఆపరేటర్లకు గట్టి పోటీని ఇచ్చే దిశలో పోస్టల్ శాఖను ముందుకు తీసుకువెళతాయని నిపుణులు చెబుతున్నారు.