Adani Power: యుద్ధ సమయంలోనూ అదానీ లాభాల జోరు.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్న షేర్!
Adani Power: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ భయాల మధ్య కూడా అదానీ పవర్ షేర్లు దూసుకుపోతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి 1,600 మెగావాట్ల విద్యుత్ సరఫరా ఆర్డర్ లభించడంతో, కేవలం రెండే రోజుల్లో ఇన్వెస్టర్లకు 7.5% పైగా లాభాలను అందించింది. పూర్తి వివరాలను ఈ స్టోరీలో చదవండి.
Adani Power: యుద్ధ సమయంలోనూ అదానీ లాభాల జోరు.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్న షేర్!
Adani Power: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా భారత స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. దలాల్ స్ట్రీట్‌లోని అగ్రగామి కంపెనీలు సైతం నష్టాల్లో కూరుకుపోతుంటే, అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ పవర్ (Adani Power) మాత్రం అనూహ్యమైన వృద్ధిని కనబరుస్తోంది. గత రెండు ట్రేడింగ్ సెషన్లలోనే ఈ స్టాక్ ఏకంగా 7.5 శాతానికి పైగా రాబడులను అందించి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది.
ఈ స్టాక్ పెరగడానికి ప్రధాన కారణం ఇదే..
మంగళవారం ట్రేడింగ్‌లో అదానీ పవర్ షేర్లు 2 శాతానికి పైగా లాభపడ్డాయి. అంతకుముందు సెషన్‌లో ఈ స్టాక్ 5 శాతం పెరిగి రూ.157.50 వద్ద ముగిసింది. ఇది గత మూడు నెలల కాలంలోనే అత్యధిక స్థాయి కావడం గమనార్హం. మార్కెట్ పతనమవుతున్నా ఈ స్టాక్ ఎందుకు పెరుగుతుందంటే.. అదానీ పవర్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక భారీ ఆర్డర్ లభించడమే ఈ భారీ ర్యాలీకి కారణమని తెలుస్తోంది. మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (MSEDCL) నుంచి అదానీ పవర్‌కు 'లెటర్ ఆఫ్ అవార్డ్' (LOA) అందింది. తన రాబోయే అల్ట్రా-సూపర్‌క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నుంచి సుమారు 1,600 మెగావాట్ల విద్యుత్తును సరఫరా చేసేందుకు కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విద్యుత్ సరఫరా ఒప్పందం 25 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఈ ప్రాజెక్ట్ కార్యకలాపాలు 2031 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి.
కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. మొదటి ఏడాదికి కిలోవాట్ గంటకు రూ.5.30 స్థిర టారిఫ్ ఉంటుంది. ఈ సందర్భంగా అదానీ పవర్ సీఈఓ ఎస్.బి.ఖ్యాలియా మాట్లాడుతూ.. "భారతదేశంలో విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ తరుణంలో ఇంధన భద్రతను నిర్ధారించడానికి ఇలాంటి దీర్ఘకాలిక ప్రాజెక్టులు చాలా కీలకం" అని పేర్కొన్నారు. మొత్తానికి యుద్ధ భయాల మధ్య కూడా అదానీ పవర్ సాధిస్తున్న ఈ లాభాలు స్టాక్ మార్కెట్ నిపుణులను ఆకర్షిస్తున్నాయి