LPG Consumption: తగ్గిన గ్యాస్ వినియోగం..పెరిగిన పెట్రోల్ వాడకం

LPG Consumption: మార్చి మొదటి వారంలో మన దేశంలో ఎల్పీజీ వాడకం తగ్గిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయితే, అదేసమయంలో పెట్రోల్, గ్యాస్ లకు డిమాండ్ పెరగడం గమనార్హం.

Update: 2026-03-18 03:43 GMT

LPG Consumption

LPG Consumption: మార్చి మొదటి వారంలో దేశవ్యాప్తంగా ఎల్పీజీ వినియోగం 17% తగ్గింది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులే దీనికి కారణంగా భావిస్తున్నారు. ఎల్ఫీజీ మార్కెట్ వాటాలో 90% ఉన్న మూడు ప్రభుత్వ రంగ సంస్థల డేటా ప్రకారం, గత ఏడాదితో పోలిస్తే LPG వినియోగం ఈ ఏడాది మార్చి మొదటి వారంలో తగ్గింది.

గత ఏడాది ఇదే సమయంలో 1.387 మిలియన్ టన్నుల వినియోగం నమోదైంది. అప్పటి తో పిలిస్తే ఇప్పుడు ఎల్ఫీజీ వినియోగం 1.147 మిలియన్ టన్నులుగా ఉంది. అదే ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి 15 రోజులతో పోల్చినా కూడా మార్చిలో వినియోగం 26.3% తక్కువగా ఉంది. మరోవైపు, పెట్రోల్ - డీజిల్ డిమాండ్ పెరిగింది. పెట్రోల్ అమ్మకాలు 13.2% పెరిగి 1.5 మిలియన్ టన్నులకు, డీజిల్ అమ్మకాలు 8.2% పెరిగి 3.384 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి.

ఇదిలా ఉండగా, లోకల్‌ సర్కిల్స్ సర్వే ప్రకారం, దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ కొరత ఆహార ధరలు పెరగడానికి దారితీసింది. పెరిగిన కమర్షియల్ గ్యాస్ ధరల కారణంగా, ఒక వారంలో 57% రెస్టారెంట్లు, 54% వీధి వ్యాపారులు తమ ప్రోడక్ట్ రేట్స్ పెంచారు. దీంతో నగరాల్లో చిన్న ఉద్యోగాలు చేసుకునే వారు.. వివిధ పనులపై ట్రావెల్ చేసే వారు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

గ్యాస్ సరఫరాకు ఇబ్బందులు లేవు..

LPG Consumption: ఇదిలా ఉంటే ప్రభుత్వం మాత్రం గ్యాస్ నిల్వలు బాగానే ఉన్నాయనీ.. సప్లై కూడా మెరుగుపడిందని చెబుతోంది. వంట గ్యాస్ వినియోగదారులు యుద్ధ భయంతో ఒక్కసారిగా బుకింగ్స్ మొదలు పెట్టడంతో కొంచెం ఇబ్బంది వచ్చిన మాట వాస్తవమేననీ.. ఇప్పుడు చక్కబడుతున్నాయని చెబుతున్నారు. బ్లాక్ మార్కెటింగ్, అక్రమ స్టాక్స్ పై కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 12,000కు పైగా దాడులు నిర్వహించారు. 15,000కు పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నిత్యావసర వస్తువుల చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది.

డిజిటల్ వ్యవస్థలు బలపడటంతో, ఆన్‌లైన్ ఎల్‌పిజి బుకింగ్ దాదాపు 94 శాతానికి పెరిగింది. రిఫైనరీల నుండి ఎల్‌పిజి ఉత్పత్తి 38 శాతం పెరిగింది.

ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?

అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడి చేశాయి. ఈ రెండు దేశాలు కలిసి ఇరాన్‌కు చెందిన అనేక సైనిక స్థావరాలు, క్షిపణి కేంద్రాలు, అణు కర్మాగారాలు, అక్కడి నాయకులు టార్గెట్ గా ఒక్కసారిగా వందలాది వైమానిక దాడులు చేశాయి. ఈ దాడులలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో సహా పలువురు ఉన్నత స్థాయి అధికారులు మరణించారు. అమెరికా ఈ ఆపరేషన్‌కు 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' అని పేరు పెట్టింది.

ఈ యుద్ధం హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలకు, క్రూడ్ ఆయిల్ సప్లయిస్ కు అంతరాయం కలిగించింది. మన దేశానికి అవసరమైన ఎల్పీజీ దిగుమతులలో 80-85% ఈ జలసంధి నుండే జరుగుతాయి. ప్రపంచంలోనే ఎల్పీజీని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాలలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. దేశానికి అవసరమైన ఎల్పీజీలో 60 శాతానికి పైగా ఇక్కడి నుండే దిగుమతి అవుతుంది. ఈ కారణంగా ఎల్పీజీ విషయంలో మన దేశంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Tags:    

Similar News