Stock Market: స్టాక్ మార్కెట్ ఢమాల్..13 లక్షల కోట్ల రూపాయలు ఆవిరి
Stock Market: స్టాక్ మార్కెట్ లో ఈరోజు పెద్ద పతనం వచ్చింది. ఈ దెబ్బతో ఇన్వెస్టర్స్ సంపద 13 లక్షల కోట్ల రూపాయలు ఆవిరి అయియింది.
Stock Market
స్టాక్ మార్కెట్ గురువారం(మార్చి 19)రోజున భారీ పతనాన్ని చూసింది. ఎంత అంటే.. గత 22 నెలల్లో ఎప్పుడూ ఇంతగా స్టాక్ మార్కెట్ పడిపోలేదు. ఈరోజు సెన్సెక్స్ 2,497 పాయింట్లు (3.26%) పడిపోయి 74,207 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 776 పాయింట్లు (3.26%) పడిపోయి 23,002 వద్దకు చేరింది. ఈరోజు బ్యాంకింగ్ - ఆటో రంగ స్టాక్‌లు అత్యధిక నష్టాలను చవిచూశాయి. అంతకుముందు, జూన్ 4, 2024న, సెన్సెక్స్ 5.74% భారీ పతనాన్ని చూసింది.
కారణమిదే..
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధం వంటి పరిస్థితులు ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఇది కార్పొరేట్ లాభాలను తగ్గిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్స్ తమ షేర్లను అమ్మి, వాటిని సురక్షితమైన పెట్టుబడుల వైపు మళ్లించడం ప్రారంభిస్తారు. ఇది మార్కెట్ పతనానికి దారితీస్తుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ పతనం వెనుక మూడు ముఖ్యమైన కారణాలున్నాయని వారు భావిస్తున్నారు.
1. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కారణంగా సరఫరా గొలుసుకు అంతరాయం ఏర్పడింది.
2. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 114 డాలర్లకు పెరిగాయి.
3. అమెరికా, ఆసియా మార్కెట్ల పతనం ప్రభావం మన స్టాక్ మార్కెట్ పైన కూడా పడుతోంది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఛైర్మన్ రాజీనామా..
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పార్ట్‌టైమ్ ఛైర్మన్ , స్వతంత్ర డైరెక్టర్ అటాను చక్రవర్తి బుధవారం రాత్రి పొద్దుపోయాక రాజీనామా చేశారు. ఫలితంగా, ఈ రోజు దాని షేర్లు 5.11% పడిపోయి, ₹43 తగ్గి ₹800కి చేరాయి.
బ్యాంకు పనితీరుపై చక్రవర్తి ప్రశ్నలు లేవనెత్తారు. తన రాజీనామాకు గల కారణాన్ని వివరిస్తూ "గత రెండేళ్లుగా, బ్యాంకులో నా వ్యక్తిగత విలువలకు, నైతికతకు విరుద్ధంగా ఉన్న కొన్ని సంఘటనలు, పద్ధతులను నేను చూశాను." అని పేర్కొన్నారు.
చక్రవర్తి రాజీనామా చేయడంతో రిజర్వ్ బ్యాంక్ ఆమోదంతో, కేకి మిస్త్రీని 2026 మార్చి 19 నుండి అమలులోకి వచ్చేలా మూడు నెలల కాలానికి తాత్కాలిక ఛైర్మన్‌గా నియమించారు. మిస్త్రీ ప్రస్తుతం బ్యాంక్ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
ఒక్క రోజులో 13 లక్షల కోట్లు..
బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ నిన్నటి ₹439 లక్షల కోట్ల నుండి ఈరోజు ₹426 లక్షల కోట్లకు తగ్గింది. అంటే, కేవలం ఒక్క రోజులోనే పెట్టుబడిదారుల సంపద ₹13 లక్షల కోట్లు క్షీణించింది.
ప్రపంచ మార్కెట్లు.. క్రూడాయిల్ ధరలు..
1. ఆసియా మార్కెట్లు పడిపోయాయి
జపాన్ నిక్కీ సూచీ 3.38% పడిపోయి 53,372 వద్ద ముగిసింది.
దక్షిణ కొరియా కోస్పి సూచీ 2.73% పడిపోయి 5,847 వద్ద ముగిసింది.
హాంకాంగ్ హాంగ్ సెంగ్ సూచీ 2.02% పడిపోయి 25,500 వద్ద ముగిసింది.
చైనా షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 1.39% తగ్గి 4,006 వద్ద ముగిసింది.
2. మార్చి 18న యూఎస్ మార్కెట్ పడిపోయింది
డౌ జోన్స్ 768 పాయింట్లు (1.63%) పడిపోయి 46,225 వద్ద ముగిసింది.
టెక్ ఆధారిత సూచీ అయిన నాస్‌డాక్ కాంపోజిట్ 1.46% పడిపోయి 22,152 వద్ద ముగిసింది.
ఎస్&పి 500 సూచీ 91 పాయింట్లు (1.36%) పడిపోయి 6,624 వద్ద ముగిసింది.
3. ముడి చమురు ధరలు 6% పెరిగి బ్యారెల్‌కు $114 దాటాయి
ఇరాన్‌తో కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ముడి చమురు ధరలలో భారీ పెరుగుదలకు కారణమైంది. పర్షియన్ గల్ఫ్ నుండి సరఫరా అంతరాయాల కారణంగా ప్రపంచ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ధరలు ఈరోజు 6% పైగా పెరిగి బ్యారెల్‌కు $114ను అధిగమించాయి. అదే సమయంలో, ఇండియన్ బాస్కెట్ ధరలు బ్యారెల్‌కు $146కు చేరుకున్నాయి.