Deadline March 31: మార్చి 31 లోపు ఈ పనులు చేయకుంటే జేబుకు చిల్లు.. పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ అలర్ట్
Deadline March 31: మార్చి 31 ఆర్థిక గడువు సమీపిస్తోంది. పన్ను ఆదా కోసం సెక్షన్ 80C పెట్టుబడులు, కొత్త పాన్ కార్డు దరఖాస్తు, టీడీఎస్ ప్రూఫ్స్ సమర్పించడం వంటి పనులు వెంటనే పూర్తి చేయండి.
Deadline March 31
Deadline March 31: 2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. మరో నాలుగు రోజుల్లో మార్చి 31 వచ్చేస్తోంది. ఈ లోపు మీరు పూర్తి చేయాల్సిన కొన్ని ఆర్థిక పనులు పెండింగ్‌లో ఉంటే, ఏప్రిల్ 1 నుంచి జేబుకు చిల్లు పడటం ఖాయం. ముఖ్యంగా ఆదాయపు పన్ను ఆదా చేసుకోవాలన్నా, పాన్ కార్డు దరఖాస్తు చేసుకోవాలన్నా ఈ కొద్ది రోజులే మీకు కీలకం. గడువు దాటితే పన్ను ప్రయోజనాలు కోల్పోవడమే కాకుండా, కొత్త నిబంధనల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
పాన్ కార్డు దరఖాస్తు
మీకు ఇంకా పాన్ కార్డు (PAN) లేదా? అయితే ఈ రోజే అప్లై చేసుకోండి. ప్రస్తుతం ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ కేవలం ఆధార్ కార్డు ఉంటే సరిపోయేలా సులభంగా పాన్ కార్డు ఇస్తోంది. కానీ, ఏప్రిల్ 1 నుంచి ఈ రూల్స్ మారబోతున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి పాన్ కార్డు దరఖాస్తుకు కేవలం ఆధార్ సరిపోకపోవచ్చు. జనన ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ వంటి అదనపు పత్రాలు సమర్పించాల్సి రావచ్చు. ఈ డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవడం సామాన్యులకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. అందుకే ఆలస్యం చేయకుండా ఈ నాలుగు రోజుల్లోనే పని పూర్తి చేసుకోవడం మంచిది.
పన్ను ఆదా: సెక్షన్ 80C కింద లక్షన్నర లాభం
మీరు పాత పన్ను విధానాన్ని అనుసరిస్తుంటే, సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందే వీలుంది. ఇందుకోసం మీరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) లేదా ఎల్ఐసీ (LIC) పాలసీల్లో పెట్టుబడి పెట్టాలి. ఈ పెట్టుబడులన్నీ మార్చి 31 లోపు పూర్తవ్వాలి. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయడం మర్చిపోతే, ఈ ఏడాదికి సంబంధించిన పన్ను ప్రయోజనాలను పూర్తిగా కోల్పోతారు. చివరి నిమిషంలో సర్వర్లు మొరాయించే అవకాశం ఉన్నందున, ఇప్పుడే ఆన్లైన్ పేమెంట్స్ పూర్తి చేయడం ఉత్తమం.
టీడీఎస్ పడకుండా చూసుకోండి
ఉద్యోగస్తులకు ఇది అత్యంత ముఖ్యమైన సమయం. మీరు ఇప్పటికే పన్ను ఆదా కోసం చేసిన పెట్టుబడుల తాలూకు రసీదులు మీ కంపెనీకి లేదా యజమానికి సమర్పించాలి. ఒకవేళ మీరు ఈ రుజువులను మార్చి 31 లోపు ఇవ్వకపోతే, మీ జీతం నుంచి భారీగా టీడీఎస్ (TDS) కోత పడుతుంది. ఆ తర్వాత ఐటీ రిటర్న్స్ దాఖలు చేసి రీఫండ్ పొందవచ్చని అనుకున్నా, ప్రస్తుతానికి మీ చేతిలో ఉండే నగదు తగ్గిపోతుంది. అనవసర ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే మీ ఇన్వెస్ట్‌మెంట్ డాక్యుమెంట్లు వెంటనే ఇచ్చేయండి.
బ్యాంక్ పనులు.. పెండింగ్ పనులు
మార్చి నెలాఖరు అంటే కేవలం పన్ను పనులే కాదు, బ్యాంక్ పనులు కూడా ఉంటాయి. మీ కేవైసీ (KYC) అప్‌డేట్ పెండింగ్‌లో ఉన్నా, లేదా డీమ్యాట్ ఖాతాకు నామినీని చేర్చకపోయినా మార్చి 31 లోపు పూర్తి చేయండి. లేదంటే ఏప్రిల్ నుంచి మీ ఖాతాలు స్తంభించిపోయే ప్రమాదం ఉంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త బడ్జెట్ నిబంధనలు అమలులోకి వస్తాయి కాబట్టి, పాత పద్ధతిలో ప్రయోజనం పొందాలంటే ఈ నాలుగు రోజులు యుద్ధ ప్రాతిపదికన పని చేయాల్సిందే.