PPF for Children: పిల్లల కోసం ఇలా ఇన్వెస్ట్ చేస్తే.. వారి భవిష్యత్ బంగారమే!
PPF for Children: పిల్లల భవిష్యత్ కోసం ఇన్వెస్ట్ చేయాలంటే పీపీఎఫ్ పథకం మంచి ఆప్షన్. ఈ పథకం పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
PPF for Children
PPF for Children: పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వారి భవిష్యత్తు అవసరాలు ఎలా తీరుతాయో అనే ఆందోళన సహజంగానే ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. కచ్చితంగా పిల్లల కోసం కొంత డబ్బు ప్రతి నెలా పొదుపు చేయాలని చూస్తారు. పిల్లల కోసం సేవింగ్స్ చేయడానికి ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి. అన్ని పథకాలు వేటికవే ప్రత్యేకతను కలిగి ఉంటాయి. వాటిలో మరింత అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చే పథకం పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం. పిల్లలకు 18 ఏళ్ళు నిండేసరికి.. వారి చదువులు.. ఉద్యోగాలు.. పెళ్లిళ్లు ఇలా ఏ అవసరానికైనా పెద్ద మొత్తంలో డబ్బు అందుకునే వీలు ఈ పీపీఎఫ్ ద్వారా దొరుకుతుంది. అయితే, పిల్లల పేరుమీద నేరుగా ఈ ఎకౌంట్ తెరవడానికి వీలు కాదు. తల్లిదండ్రులు, చట్టబద్ధమైన గార్డియన్స్ పేరుతో తెరిచే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక బిడ్డ కోసం ఒకటే పీపీఎఫ్ ఎకౌంట్ తెరవడానికి మాత్రమే అనుమతి ఉంటుంది.
ఈ ఎకౌంట్ ఎక్కడ తెరవవచ్చు?
పీపీఎఫ్ ఎకౌంట్ తెరవడానికి వయోపరిమితి ఏమీలేదు. చిన్న పిల్లలకు పుట్టిన సంవత్సరంలో కూడా ఈ ఎకౌంట్ తెరవవచ్చు.ఈ ఖాతాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి అధీకృత బ్యాంకుల నుండి లేదా పోస్ట్ ఆఫీసుల నుండి తెరవవచ్చు. దీని కోసం జనన ధృవీకరణ పత్రం, ఆధార్ మొదలైన పత్రాలు అవసరం.
కనీసం ఎంత మొత్తం పెట్టాల్సి ఉంటుంది?
మీరు ఈ PPF ఎకౌంట్ ను కేవలం రూ.100తో తెరవవచ్చు. కానీ, ఖాతాను యాక్టివ్‌గా ఉంచడానికి మీరు సంవత్సరానికి కనీసం రూ.500 ఎకౌంట్ లో ఉంచాల్సి ఉంటుంది. మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పరిమితి పేరెంట్, చైల్డ్ ఎకౌంట్స్ రెండింటికీ వర్తిస్తుంది. ఒకేవేళ మీరు రూ.1.5 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి పెడితే, మీకు ఎటువంటి వడ్డీ లేదా టాక్స్ బెనిఫిట్స్ దొరకవు.
ప్రయోజనాలివే..
ప్రస్తుతం, ఈ ప్రావిడెంట్ ఫండ్ పథకానికి వార్షిక వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. దీనిని వార్షిక చక్రవడ్డీ ఆధారంగా లెక్కిస్తారు. ఉదాహరణకు, ఒక 3 ఏళ్ల చిన్నారి పేరుపై ఈ అకౌంట్ తీసుకున్నారని అనుకుందాం. అప్పుడు నెలకు 10,882 రూపాయలు ఈ ఎకౌంట్ లో పెడితే 15 ఏళ్లలో రూ. 35 లక్షల రూపాయల వరకూ వస్తాయి. అంటే ఆ చిన్నారికి 18 ఏళ్లు వచ్చేసరికి వారికి కావాల్సిన పెళ్లి, చదువు లేదా ఇతర పెద్ద అవసరాలకి సరిపోతుంది.
టాక్స్ బెనిఫిట్స్..
అంతేకాకుండా, PPF ఖాతాలో పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. అదేవిధంగా, ఈ ఖాతాలో సంపాదించిన వడ్డీ,పెట్టుబడి మొత్తం పూర్తి పన్ను ప్రయోజనాలను పొందుతాయి. అయితే, సంవత్సరంలో మీరు 1.5 లక్షల కంటే ఎక్కువ ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి.