What TRS leaders waiting for in Sravana month: శ్రావణమాసం కోసం గులాబీ నేతలు ఎందుకంతగా ఎదురుచూశారు?

Update: 2020-07-30 12:03 GMT

What TRS leaders waiting for in Sravana month: ఉమ్మడి మెదక్ జిల్లా అధికార టీఆర్‌ఎస్‌ నాయకులు, కొద్ది రోజులుగా ఆషాఢ మాసం ఎప్పుడు పోతుంది శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా? అని కళ్ళల్లో వొత్తులు వేసుకుని ఎదురు చూసారట. అనుకున్నట్లుగానే శ్రావణం వచ్చేసింది. మరి ఈ శ్రావణమాసంలో ఏం జరగబోతోంది? అసలు ఎందుకు శ్రావణం రావాలని వారు అంతగా ఎందుకు కోరుకున్నారు? లెట్స్ వాచ్‌ దిస్ స్టోరి.

ఆషాడం ముగిసింది. శ్రావణ మాసం వచ్చింది. ఈ పవిత్ర శ్రావణ మాసంలో అందరూ పూజా పునస్కారాలతో భగవంతుణ్ణి ప్రార్ధించడం పరిపాటే. కానీ ఉమ్మడి మెదక్ జిల్లాలో కొందరు అధికార పార్టీ నాయకులు, ఈ శ్రావణ మాసంలో తమపై భగవంతుడి కృప ఉండాలని గుళ్లు, గోపురాలు తిరుగుతున్నారట. భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించడంతో పాటు పనిలో పనిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కటాక్షం పొందేలా చెయ్యాలని, దేవతామూర్తులను ప్రార్థిస్తున్నారట.

అధికార టీఆర్ఎస్‌ నాయకుల తాపత్రయానికి అసలు కారణం నామినేటెడ్ పదవులట. ఎంతో కాలంగా ఎలాంటి పదవులు లేకుండా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న నాయకులు చాలా మంది, అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారట. ఆషాఢ మాసం ముగిసిన వెంటనే శ్రావణ మాసం మంచి రోజుల్లో, సీఎం కేసీఆర్ పదవుల పంపకాలు చేపడతారని వారికి సమాచారం ఉందట. అందుకే వారు శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని వేయి కళ్లతో నిరీక్షించారట.

ఇక ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారి లిస్ట్ చాలా పెద్దదిగానే ఉందట. ఈ పదవులు ఆశిస్తున్న వారిలో ప్రముఖంగా మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్‌ నేత దేవేందర్ రెడ్డి, పఠాన్‌చెరు సపాన్ దేవ్, సంగారెడ్డి సెగ్మెంట్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణలు ఉన్నారు. వీరిలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేరు ప్రముఖంగా వినబడుతోందట. ఏడాది క్రితం చేనేత కార్పొరేషన్ ఛైర్మెన్ గా చింతా ప్రభాకర్ పేరు దాదాపుగా ఖరారై, చివరి నిమిషంలో ఎందుకో ఆగిపోయిందట. ఈసారి ఎలాగైనా ఆయనకు పదవీ యోగం దక్కుతుందని పార్టీ ఉన్నతస్థాయి వర్గాల్లో చర్చ నడుస్తోందట. ఇటీవలే టీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి సైతం రాష్ట్రస్థాయిలో నామిటెడ్ పదవి దక్కుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆమెకు ఆ మేరకు హామీ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తమ్మీద ఈ శ్రావణ మాస ఫలితం ఎవరికి దక్కుతుందో త్వరలో తెలిసిపోతుంది.

Full View


Tags:    

Similar News