Farmers Current Shock: కరెంట్ షాక్‌తో వరుసగా అన్నదాతల మృత్యువాత

Farmers Current Shock: కరెంట్ షాక్‌తో వరుసగా అన్నదాతల మృత్యువాత
x
Highlights

Farmers Current Shock: ఆరుగాలం శ్రమించే రైతులు విద్యుత్ షాక్ తో నేలకొరుగుతున్నారు. విద్యుత్ తీగలు, ట్రాన్స్ ఫార్మర్ లు రైతుల పాలిట యమపాషాలవుతున్నాయి....

Farmers Current Shock: ఆరుగాలం శ్రమించే రైతులు విద్యుత్ షాక్ తో నేలకొరుగుతున్నారు. విద్యుత్ తీగలు, ట్రాన్స్ ఫార్మర్ లు రైతుల పాలిట యమపాషాలవుతున్నాయి. తమ పంట పొలాల్లోనే విగత జీవులుగా పడిపోతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గత రెండు నెలల్లోనే 15 మంది రైతులు విద్యుత్ షాక్ తో ప్రాణాలు కోల్పోయారు. పంట పొలాల్లో పిట్టల్లా రాలిపోతున్న రైతులపై హెచ్‌ఎం టీవీ స్పెషల్ రిపోర్టు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో వ్యవసాయ క్షేత్రాలే రైతుల పాలిట మృత్యువాటికలుగా మారుతున్నాయి. కరెంట్ అంతరాయం లేదా మరేదైనా సమస్య తలెత్తినప్పుడు విద్యుత్ శాఖ సిబ్బంది స్పందించక పోవడంతో రైతులే స్వయంగా రిపేరింగ్ పనులు చేస్తున్నారు. కరెంట్ షాక్ తో ప్రాణాలు కోల్పోతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ జూన్, జులై నెలలో 15 మంది రైతులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

జూన్ 3 న సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బాచేపల్లి కి చెందిన మల్లేశం అనే రైతు ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యుజ్ వేస్తుండగా విద్యుత్ షాక్ తో అక్కడిక్కడే మరణించాడు. జులై 2 న నాగల్ గిద్ద మండలానికి చెందిన బాబు అనే రైతు ఇదే తరహాలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల 16 న సిద్దిపేట జిల్లా ఎన్సాన్ పల్లి గ్రామానికి చెందిన రాజయ్య అనే రైతు పొలం వద్ద స్టార్టర్ సరిచేయడానికి వెళ్లి కరెంట్ షాక్ తో చనిపోయాడు. ఈనెల 23 న సిద్దిపేట జిల్లాలో ఒకే రోజు ముగ్గురు రైతులు విద్యుత్ షాక్ తో దుర్మరణం పాలయ్యారు.

విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యమే మరణాలకు కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ సమస్యలు వచ్చినప్పుడు ఫిర్యాదు చేస్తే విద్యుత్ సిబ్బంది వెంటనే స్పందించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులే స్వయంగా రిపేరింగ్ పనులు చేస్తూ కరెంట్ షాక్ తో మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయిన, గాయపడ్డ వారికి విద్యుత్ శాఖ నుండి ఆశించిన సహాయం అందడం లేదు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం స్పష్టం గా కనబడుతున్నప్పటికి సహాయం అందించడానికి సవాలక్ష కొర్రీ లు పెడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ప్రమాదాల బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

రైతుల పొరపాటు, అవగాహన లేమి కారణంగానే ప్రాణాలు కోల్పోతున్నారని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. కింది స్థాయి విద్యుత్ సిబ్బంది స్పందించక పోతే పై అధికారులకు ఫిర్యాదు చేయాలని, అంతే తప్ప స్వయంగా మరమ్మతులకు పూనుకోవద్దని కోరుతున్నారు. ఈ వర్షాకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రతీ గ్రామంలో చాటింపు వేయిస్తున్నామని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories