KTR: కేసీఆర్‌కు నోటీసులు కేవలం 'డైవర్షన్ పాలిటిక్స్'.. కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ టీవీ సీరియల్‌పై కేటీఆర్ సెటైర్లు!
SIT Notices to KCR: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ (SIT) నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
SIT Notices to KCR: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ (SIT) నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న 'డైవర్షన్ పాలిటిక్స్'లో ఇదొక భాగమని ఆయన మండిపడ్డారు. గురువారం ఈ నోటీసుల వ్యవహారంపై స్పందించిన కేటీఆర్, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శల జడివాన కురిపించారు.
రాజకీయ కక్ష సాధింపు చర్యే!
ఈ విచారణలన్నీ ఒక "అట్టర్ ఫ్లాప్ టీవీ సీరియల్" లాగా ఉన్నాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోలేక కాంగ్రెస్ ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ ఒక మహానాయకుడని, కేవలం నోటీసులతో ఆయన కీర్తిని, ఉద్యమ చరిత్రను చెరిపేయడం ఎవరివల్లా కాదని స్పష్టం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలే సరైన సమయంలో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సింగరేణి కుంభకోణంపై ఎందుకు విచారణ లేదు?
"సిట్ అంటే - సీట్ (Sit) అంటే కూర్చోవడం, స్టాండ్ (Stand) అంటే నిలబడటం.. రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఆడటమే ఈ సిట్ పని" అని కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతిపక్ష నేతలను వేధించడం మానేసి, తన బావమరిదికి అప్పగించిన రూ. 47,000 కోట్ల సింగరేణి బొగ్గు టెండర్ల కుంభకోణంపై విచారణ జరిపించే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా? అని సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి రాజకీయ వేధింపులకు భయపడబోదని, న్యాయపోరాటంతో పాటు ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ అన్యాయ పాలనపై పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ ఉద్ఘాటించారు.