తండ్రి డ్రైవర్.. కొడుకు కండక్టర్: ఒకే బస్సులో తండ్రీకొడుకుల డ్యూటీ.. నెట్టింట వైరల్!

సాధారణంగా తండ్రీకొడుకులు ఒకే సంస్థలో పనిచేయడం చూస్తుంటాం. కానీ, తండ్రి నడుపుతున్న బస్సులోనే కొడుకు కండక్టర్‌గా విధులు నిర్వహించడం అరుదుగా కనిపిస్తుంది.

Update: 2026-03-14 10:17 GMT

తండ్రి డ్రైవర్.. కొడుకు కండక్టర్: ఒకే బస్సులో తండ్రీకొడుకుల డ్యూటీ.. నెట్టింట వైరల్!

సిద్ధిపేట: సాధారణంగా తండ్రీకొడుకులు ఒకే సంస్థలో పనిచేయడం చూస్తుంటాం. కానీ, తండ్రి నడుపుతున్న బస్సులోనే కొడుకు కండక్టర్‌గా విధులు నిర్వహించడం అరుదుగా కనిపిస్తుంది. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో అచ్చం ఇలాంటి దృశ్యమే ఆవిష్కృతమైంది. తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకే బస్సులో కలిసి పనిచేయడం చూసి ప్రయాణికులు ఆశ్చర్యంతో పాటు అభినందనలు కురిపించారు.

34 ఏళ్లుగా డ్రైవర్‌గా సేవలు

హుస్నాబాద్‌కు చెందిన బంధనాపురం ఎల్లయ్య గత 34 ఏళ్లుగా టీజీఆర్టీసీలో (TGRTC) డ్రైవర్‌గా సేవలందిస్తున్నారు. ఆయన సుదీర్ఘ కెరీర్‌లో ఒక్క ప్రమాదం కూడా జరగకుండా 'ప్రమాదరహిత డ్రైవర్‌'గా గుర్తింపు పొందారు. తన విధి నిర్వహణలో ప్రదర్శించిన నైపుణ్యానికి గాను ఎల్లయ్య పలుమార్లు ఉత్తమ డ్రైవర్ అవార్డులను కూడా అందుకున్నారు.

తండ్రి డ్రైవర్.. కొడుకు కండక్టర్

ఎల్లయ్య కుమారుడు బంధనాపురం ప్రేమ్ అదే సంస్థలో కండక్టర్‌గా చేరారు. శుక్రవారం వీరిద్దరికీ హుస్నాబాద్‌ డిపోకు చెందిన ఒకే బస్సులో డ్యూటీ పడింది. దీంతో తండ్రి స్టీరింగ్ పట్టుకోగా, కుమారుడు టికెట్లు జారీ చేస్తూ కనిపించారు. తండ్రీకొడుకులు ఇలా ఒకే బస్సులో విధులు నిర్వర్తించడం హుస్నాబాద్ బస్టాండ్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది.

తండ్రి మురిపెము

తన కుమారుడితో కలిసి ఒకే బస్సులో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం పట్ల ఎల్లయ్య సంతోషం వ్యక్తం చేశారు. తన వారసుడు కూడా ఆర్టీసీలోనే పనిచేస్తూ తన కళ్లముందే ఉండటం గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News