KCR SIT Notice: కేసీఆర్ నోటీసులపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు.. ఇది మున్సిపల్ ఎన్నికల కుట్రే!
Harish Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత కేసీఆర్‌కు సిట్ (SIT) నోటీసులు జారీ చేయడంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Harish Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత కేసీఆర్‌కు సిట్ (SIT) నోటీసులు జారీ చేయడంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌పై బురద జల్లాలని చూడటం అంటే సూర్యుడిపై ఉమ్మి వేయడమేనని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల జడివాన కురిపించారు.
కుంభకోణాల నుంచి దృష్టి మళ్లించే కుట్ర!
ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. సింగరేణి కుంభకోణం మరియు పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ నోటీసుల డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందేందుకే రేవంత్ రెడ్డి ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
భయపడే ప్రసక్తే లేదు..
తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ వెంటే ఉందన్న హరీశ్ రావు, ఇలాంటి రాజకీయ వేధింపులకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. "రేవంత్ రెడ్డి రాజకీయ వేధింపులు కొత్తేమీ కాదు, చట్టబద్ధంగానే వీటిని ఎదుర్కొంటాం. కేసీఆర్ ఇమేజ్‌ను దెబ్బతీయడం ఎవరివల్లా కాదు" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అప్రజాస్వామిక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.