Yadagirigutta: యాదగిరిగుట్టలో ‘ఇంటి దొంగల’ చేతివాటం? రూ. 10 లక్షల విలువైన బంగారు, వెండి డాలర్లు మాయం!

Yadagirigutta: తెలంగాణ తిరుపతిగా వెలుగొందుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తాజాగా జరిగిన ఆడిట్ తనిఖీలు సంచలన విషయాలను బయటపెట్టాయి.

Update: 2026-01-29 09:26 GMT

Yadagirigutta: తెలంగాణ తిరుపతిగా వెలుగొందుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తాజాగా జరిగిన ఆడిట్ తనిఖీలు సంచలన విషయాలను బయటపెట్టాయి. ఆలయ ప్రచార విభాగంలో ఉండాల్సిన దాదాపు రూ. 10 లక్షల విలువైన బంగారు, వెండి డాలర్లు గల్లంతైనట్లు వెలుగులోకి వచ్చింది.

ఆడిట్‌లో బయటపడ్డ నిర్లక్ష్యం:

ఆలయ రికార్డుల క్రమబద్ధీకరణలో భాగంగా ఆడిట్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో స్టాక్ రిజిస్టర్‌కు, వాస్తవంగా ఉన్న నిల్వలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపించింది. సుమారు 200 బంగారు డాలర్లు, 1000 వెండి డాలర్లు మాయమైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇవి గతేడాది కాలంలోనే మాయమవగా, తాజాగా ఆడిట్ జరిగే వరకు అధికారులు ఈ విషయాన్ని గుర్తించకపోవడం గమనార్హం.

సిబ్బంది ప్రమేయంపై అనుమానాలు:

కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రచార విభాగం నుంచి ఇంత పెద్ద మొత్తంలో డాలర్లు మాయమవ్వడం వెనుక 'ఇంటి దొంగల' హస్తం ఉండవచ్చని భక్తులు అనుమానిస్తున్నారు. గతంలో స్వామివారి లడ్డూ ప్రసాదంలో వాడే చింతపండు చోరీకి గురైన ఘటన మరవకముందే.. ఇప్పుడు విలువైన డాలర్లు కనిపించకపోవడం ఆలయ అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఎత్తిచూపుతోంది.

ప్రస్తుతం ఆలయ ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు. రికార్డుల్లో అక్రమాలకు పాల్పడిన బాధ్యుల నుంచి నగదు రికవరీ చేయడంతో పాటు, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని దేవస్థానం అధికారులు తెలిపారు.

Tags:    

Similar News