Medaram Jathara 2026 : అన్ని దారులు మేడారం వైపే..గద్దెలపై కొలువుదీరిన సారలమ్మ

అన్ని దారులు మేడారం వైపే..గద్దెలపై కొలువుదీరిన సారలమ్మ

Update: 2026-01-29 01:30 GMT

Medaram Jathara 2026 : తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవాలు, అన్యాయంపై పోరాడిన వీర వనితలు సమ్మక్క-సారలమ్మల మహా జాతర ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో కన్నులపండువగా మొదలైంది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర కేవలం గిరిజనులకే కాకుండా యావత్ హిందూ సమాజానికే ఒక ఆధ్యాత్మిక పండుగ. నాలుగు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో మొదటి రోజైన బుధవారం రాత్రి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను పూజారులు సంప్రదాయబద్ధంగా మేడారం గద్దెలపైకి తీసుకువచ్చారు.

ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం కన్నెపల్లి నుంచి సారలమ్మను పూజారులు తీసుకువచ్చారు. అదే సమయంలో మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజును, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజును మేడారం గద్దెల వద్దకు తీసుకువచ్చారు. డప్పు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, భక్తుల కోలాహలం మధ్య దేవతలను గద్దెలపై ప్రతిష్ఠించారు. దీంతో జాతరలోని మొదటి కీలక ఘట్టం పూర్తయినట్లయ్యింది.

దేవతల దర్శనానికి ముందు భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించడం ఇక్కడ ఆనవాయితీ. జాతరకు వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం జంపన్న వాగు వద్ద అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులు వాగులో స్నానాలు ఆచరించి, తడి బట్టలతోనే తల్లుల దర్శనం కోసం బారులు తీరుతున్నారు. తమ మొక్కుల ప్రకారం దేవతలకు బంగారం సమర్పించి, పసుపు, కుంకుమలు పెట్టి దీవెనలు అందుకుంటున్నారు. భక్తులు అడవిలోనే చిన్న చిన్న గుడారాలు వేసుకుని విడిది చేస్తూ ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయారు.

జాతరలో రెండో రోజైన గురువారం (జనవరి 29) సాయంత్రం అత్యంత అపురూపమైన ఘట్టం చోటుచేసుకోనుంది. చిలుకలగుట్టపై ఉన్న సమ్మక్క తల్లిని కుంకుమభరిణ రూపంలో పూజారులు గద్దెపైకి తీసుకువస్తారు. సమ్మక్క తల్లి గద్దెపైకి వచ్చే సమయంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పిస్తారు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడటానికి కోట్లాది మంది కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. సమ్మక్క కూడా గద్దెపైకి చేరిన తర్వాత జాతర పూర్తి స్థాయి ఆధ్యాత్మిక వెలుగుతో విరాజిల్లుతుంది.

శుక్రవారం (జనవరి 30) నాడు భక్తులు తమ ఇంటి దేవతలుగా భావించే సమ్మక్క-సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించుకుంటారు. రాజకీయ ప్రముఖులు, విదేశీ పర్యాటకులు సైతం ఈ రోజున దేవతలను సందర్శిస్తారు. శనివారం (జనవరి 31) సాయంత్రం వన దేవతలు తిరిగి వన ప్రవేశం చేయడంతో ఈ నాలుగు రోజుల మహాక్రతువు ముగుస్తుంది. ప్రభుత్వం దాదాపు 10 వేల మంది పోలీసులతో భద్రతను పర్యవేక్షిస్తుండగా, భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

Tags:    

Similar News