Danam Nagender: అనర్హత పిటిషన్‌పై దానం నాగేందర్ ట్విస్ట్: నేను రాజీనామా చేయలేదు.. ఆ పిటిషన్ కొట్టేయండి!
Danam Nagender: తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశంపై ఎమ్మెల్యే దానం నాగేందర్ దాఖలు చేసిన అఫిడవిట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Danam Nagender: తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశంపై ఎమ్మెల్యే దానం నాగేందర్ దాఖలు చేసిన అఫిడవిట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనపై బీఆర్‌ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌ను కొట్టివేయాలని కోరుతూ ఆయన స్పీకర్ కార్యాలయానికి అఫిడవిట్ సమర్పించారు. ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని స్పీకర్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో దానం స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది.
అఫిడవిట్‌లో దానం నాగేందర్ పేర్కొన్న ప్రధానాంశాలు:
తాను బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, కాబట్టి తనపై ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదని దానం పేర్కొన్నారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు కూడా తనకు ఎటువంటి అధికారిక సమాచారం లేదని ఆయన అఫిడవిట్‌లో వెల్లడించారు. వాస్తవాలను దాచి తనపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ కోరుతోందని, ఆ పిటిషన్‌కు విలులేదని దానిని కొట్టివేయాలని స్పీకర్‌ను విన్నవించారు.
30న స్పీకర్ విచారణ
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణను వేగవంతం చేశారు. ఈ నెల 30న దానం నాగేందర్‌తో పాటు మరికొందరు ఎమ్మెల్యేల పిటిషన్లపై స్పీకర్ విచారణ జరపనున్నారు. విచారణకు ముందే దానం తాను పార్టీ మారలేదని సాంకేతిక కారణాలను తెరపైకి తేవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్, గత లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అఫిడవిట్‌లో 'రాజీనామా చేయలేదని' పేర్కొనడంపై బీఆర్‌ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.