Vikarabad: కన్నవారికే కాలయముడైన కుమార్తె.. ప్రియుడి కోసం తల్లిదండ్రులకు విషం ఇంజక్షన్ ఇచ్చి హత్య!

Vikarabad: వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలో ఒళ్లు గగుర్పొడిచే ఘోరం వెలుగుచూసింది.

Update: 2026-01-28 09:15 GMT

Vikarabad: వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలో ఒళ్లు గగుర్పొడిచే ఘోరం వెలుగుచూసింది. ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోవాలన్న ఆశతో, దానికి అడ్డుపడుతున్నారన్న కోపంతో ఓ కుమార్తె కన్న తల్లిదండ్రులను అత్యంత కిరాతకంగా చంపేసింది. వృత్తిరీత్యా నర్సు అయిన ఆమె, తన వృత్తి నైపుణ్యాన్ని ప్రాణాలు కాపాడటానికి కాకుండా, ప్రాణాలు తీయడానికి ఉపయోగించింది.

నొప్పుల ఇంజక్షన్ అని చెప్పి విషప్రయోగం

వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. యాచారం గ్రామానికి చెందిన దశరథ్‌, లక్ష్మి దంపతుల చిన్న కుమార్తె సురేఖ సంగారెడ్డిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అక్కడ ఒక యువకుడితో ప్రేమలో పడిన ఆమె, అతడినే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో గొడవపడింది. అయితే తల్లిదండ్రులు నిరాకరించి, సురేఖకు మరో యువకుడితో పెళ్లి సంబంధం ఖాయం చేశారు.

దీంతో వారిని వదిలించుకోవాలని ప్లాన్ వేసిన సురేఖ, ఆదివారం నాడు తల్లిదండ్రులకు 'మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి' అని నమ్మబలికి విషం ఇంజక్షన్లు ఇచ్చింది. విషం శరీరంలోకి చేరడంతో వారు విలవిలలాడుతూ ప్రాణాలు విడిచారు.

ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం

తల్లిదండ్రులు మరణించిన తర్వాత, సురేఖ ఏమీ తెలియనట్టుగా వారిద్దరినీ ఒకే చోట పడుకోబెట్టింది. అనంతరం తన సోదరుడు అశోక్‌కు ఫోన్ చేసి, "అమ్మానాన్న స్పృహ తప్పి పడిపోయారు" అని నాటకమాడింది. అప్పుల బాధతో వారు ఆత్మహత్య చేసుకున్నారని అందరూ భావించేలా కథ అల్లింది.

పోలీసుల విచారణలో బట్టబయలు

అయితే, మృతదేహాల వద్ద అనుమానాస్పద స్థితిని గమనించిన పోలీసులు విచారణ చేపట్టారు. సురేఖ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి గట్టిగా విచారించగా అసలు నిజం ఒప్పుకుంది. తన ప్రేమకు అడ్డు వస్తున్నారనే కారణంతోనే తల్లిదండ్రులను చంపేసినట్లు నిందితురాలు అంగీకరించింది. దీంతో పోలీసులు సురేఖను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News