Skyways: హైదరాబాద్ లో కొత్తగా రెండు స్కైవే ఫ్లైఓవర్లు

Update: 2020-08-05 08:07 GMT

Skyways:హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎంతటి నరకం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనఖర్లేదు. దీన్ని అరికట్టేందుకు నగరంలో అనేక చోట్ల ఫ్లై ఓవర్ లు నిర్మించారు. అయినా ఇంకా పలుచోట్ల ట్రాఫిక్ జామ్ లు, హెవీ ట్రాఫిక్ రూట్స్ ఉన్నాయి. అలాంటి సమస్యలను తగ్గించేందుకు GHMC, HMDA ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇకపై సిటీలో స్కైవే ఫ్లై ఓవర్లను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు.

హైదరాబాద్ నగరంలో రెండు భారీ ఫ్లై ఓవర్ లు నిర్మాణం జరగనున్నాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని జీ ప్లస్ టూ పద్దతిలో రోడ్డు, ఫ్లై ఓవర్ కమ్ మెట్రో కారిడర్ డబుల్ డెక్కర్ స్కైవేల నిర్మాణానికి HMDA ప్రణాళికలు రూపొందించింది. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి శామీర్ పేట వరకు అలాగే ప్యారడైజ్ నుంచి కొంపల్లి ఆర్వోబీ వరకూ స్కైవే నిర్మాణానికి కసరత్తు చేస్తోంది. జేబీఎస్ శామీర్ పేట స్కైవేకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్ సిద్ధం కాగా మరో స్కైవే నిర్మాణానికి కన్సల్టెన్సీ ద్వారా డీపీఆర్ ను తయారు చేయిస్తోంది. సుమారు 5 వేల కోట్ల వ్యయం కానున్న ఈ ప్రాజెక్లులను సొంతంగా HMDA చేపట్టనుంది.

SRDPలో భాగంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణాలతో ట్రాఫిక్ సమస్యకు కొంత మేర పరిష్కరం లభించింది. అయితే కంటోన్మెంట్‌ ప్రాంతంలో ఇరుకైన రోడ్ల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్‌ నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు చేరుకోవాలంటే రద్దీ వేళలో గంటకు పైగా సమయం పడుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌-కరీంనగర్‌ మార్గంలో జేబీఎస్‌ నుంచి శామీర్‌పేట వరకు 18.50 కిలోమీటర్ల మేర డబుల్‌ డెక్కర్‌ స్కైవేను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే, హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ మార్గంలో ప్యారడైజ్‌ నుంచి కొంపల్లి తర్వాత వచ్చే ఆర్‌వోబీ వరకూ 18.35 కిలోమీటర్ల మేర డబుల్‌ డెక్కర్‌ స్కైవే సాధ్యాసాధ్యాలపై సంబంధిత కన్సల్టెన్సీ ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. హైదరాబాద్ లో స్కైవేల నిర్మాణం వల్ల ట్రాఫిక్ సమస్యలు తీరడంతో పాటు నగరం మరింత అందాన్ని తీర్చి దిద్దుకుంటుంది.

Tags:    

Similar News