Godavari River: భద్రాచలం దగ్గర క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం.. ప్రస్తుతం 47 అడుగుల వద్ద గోదావరి
Godavari River: ఇవాళ 56 అడుగులకు చేరే అవకాశం
Godavari River: భద్రాచలం దగ్గర క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం.. ప్రస్తుతం 47 అడుగుల వద్ద గోదావరి
Godavari River: భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నిన్న కాస్త శాంతించినట్లు కనిపించినా నదిలోకి భారీగా వరద కొనసాగుతోంది. నిన్న 50 అడుగులకు నీటిమట్టం చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేయగా.. వరద ఉధృతి తగ్గడంతో హెచ్చరిక ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ప్రవాహం 47 అడుగులకు చేరింది. అయితే నదిలో అంతకంతకూ వరద పెరుగుతుండటంతో మరోసారి హెచ్చరిక జారీ చేసే అవకాశాలున్నాయి. ఇవాళ గోదావరి నది 56 అడుగుల వరకు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో ముందస్తు చర్యలకు సిద్ధమయ్యారు. ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంత ప్రజలు తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలిరావాలని సూచించారు.
ఎడతెరిపి లేని వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతోంది. వైరా రిజర్వాయర్ కు భారీగా వరదనీరు చేరడంతో జలసవ్వడి నెలకొంది. రిజర్వాయర్ సమీపంలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేసి అటువైపు ప్రజలను ఎవరిని పోనీయకుండా నిలుపుదల చేశారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్ నుంచి నీరు ఉధృతంగా రావడంతో వైరా నది పొంగిపొర్లుతుంది. లక్ష్మీ పురం, సిరిపురం గ్రామాలకు రాకపో కలు నిలిచిపోయాయి. వరద ఉధృతికి వైరా నది ప్రక్కల వందలాది ఎకరాల పంటలు నీటము నిగాయి. మరల వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాలు మాత్రం పూర్తిగా జలమయమయ్యే ప్రమాదం ఉంది. రిజర్వాయర్ నీటిమట్టం ప్రస్తుతం 21.5గా నమోదైంది. జలప్రవాహ సవ్వడులను స్వయంగా చూసేందుకు పర్యాటకులను అనుమతివ్వొద్దని అధికారులు నిర్ణయించారు.
అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కిన్నెరసాని డ్యామ్ లోకి వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా.. ప్రస్తుతం 400 అడుగులకు నీరు చేరుకుంది. 28 వేల క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. 4 గేట్లు ఎత్తి 35 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.