Ibomma Ravi Case: విచారణలో పూటకో మాట, పోలీసులకు కొత్త కోణాలు

తెలుగు సినీ పరిశ్రమను కుదిపేసిన పైరసీ కేసులో ఐబొమ్మ రవి పేరు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల అరెస్టైన రవిని పోలీసులు మూడోసారి సైబర్‌క్రైమ్‌ కస్టడీకి తీసుకున్నారు.

Update: 2025-12-20 05:34 GMT

Ibomma Ravi Case: విచారణలో పూటకో మాట, పోలీసులకు కొత్త కోణాలు

తెలుగు సినీ పరిశ్రమను కుదిపేసిన పైరసీ కేసులో ఐబొమ్మ రవి పేరు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల అరెస్టైన రవిని పోలీసులు మూడోసారి సైబర్‌క్రైమ్‌ కస్టడీకి తీసుకున్నారు. అతడిని 12 రోజుల పాటు విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతి ఇవ్వడంతో విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

విచారణ సందర్భంగా రవి తనతో పాటు ప్రసాద్‌, ప్రహ్లాద్‌ అనే ఇద్దరిని రంగంలోకి దింపినట్లు వెల్లడించాడు. ప్రసాద్‌ తన పదో తరగతి వరకు స్నేహితుడని చెప్పిన రవి, ప్రహ్లాద్‌ గురించి మాత్రం స్పష్టమైన వివరాలు ఇవ్వకుండా మౌనం వహిస్తున్నాడు. తాను కేవలం సినిమా వెబ్‌పోర్టల్స్‌కు సేవలు మాత్రమే అందించానని, ఇతర ఉద్యోగాల్లాగే దీనినీ ఒక పనిగా ఎంచుకున్నానని పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వ్యాపారం చేయాలని భావించానని, పోటీ లేని వ్యాపారమని భావించి పైరసీ వైపు మొగ్గు చూపినట్లు రెండో రోజు కస్టడీలో రవి వెల్లడించినట్టు తెలుస్తోంది. అయితే పలు ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు ఇస్తూ, పూటకో కొత్త కథ చెబుతూ తాను అమాయకుడినని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పోలీసుల దర్యాప్తు ప్రకారం, రవి గత ఆరేళ్లలో దాదాపు 21 వేల సినిమాలను పైరసీ చేసి ఐబొమ్మ, బప్పం టీవీ వంటి వెబ్‌పోర్టల్స్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు తేలింది. పైరసీ నేరమని తెలిసినా పట్టుబడకుండా ఉండేందుకు అతడు ముందే గట్టి పథకం వేసుకున్నాడని అధికారులు తెలిపారు. తన ఆనవాళ్లు ఎక్కడా బయటపడకుండా ఉండేందుకు ‘ప్రహ్లాద్‌కుమార్‌’ అనే నకిలీ వ్యక్తిని సృష్టించి, ఆ పేరుతో ఆధార్‌, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు తీసుకుని వెబ్‌పోర్టల్స్‌ నిర్వహించినట్లు వెల్లడైంది.

అంతేకాదు, కరీబియన్‌ దీవుల్లోని సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నేవిస్‌ దేశ పౌరసత్వం కూడా అదే పేరుతో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీలన్నీ మిత్రుడు ప్రసాద్‌ డిజిటల్‌ సంతకం ద్వారా నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ మొత్తం వ్యవహారంలో తాను కేవలం నామమాత్రమేనని నిరూపించేందుకు అవసరమైన సాక్ష్యాలను ముందుగానే సిద్ధం చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

ఐబొమ్మ కేసులో కీలకంగా వినిపిస్తున్న ప్రహ్లాద్‌ ఎవరు అనే ప్రశ్నకు మాత్రం రవి సమాధానం చెప్పడం లేదు. ‘గుర్తులేదు’, ‘ఇప్పుడే చెప్పలేను’ అంటూ ప్రశ్నలను తప్పించుకుంటున్నాడు. గతంలో కస్టడీలో ఉన్నప్పుడు ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌పోర్టల్స్‌ను తానే నడిపినట్లు ఒప్పుకున్న రవి, జైలుకు వెళ్లితే బయటకు రావడం కష్టమవుతుందనే భయంతో మాట మార్చుతున్నాడని పోలీసులు భావిస్తున్నారు.


Tags:    

Similar News